మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయాలి
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:20 AM
మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తూ, వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా సాధికారత కేంద్రం పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తూ, వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా సాధికారత కేంద్రం పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మహిళలకు అందిస్తున్న సేవలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించడంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కీలక పాత్ర పోషించాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలు, పొదుపు, రుణాలు, ఆర్థిక నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి మహిళలకు నైపుణ్య శిక్షణ అందించాలని తెలిపారు. మహిళలు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తదితర రంగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తోందన్నారు. వీ హబ్ సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతకు సంబంధించిన అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాధించిన పురోగతిని నమోదు చేయాలని సూచించారు. మహిళలు ప్రారంభించే స్వయం ఉపాధి, వ్యాపార కార్యకలాపాలు నిలదొక్కుకునేలా శిక్షణతోపాటు మార్కెటింగ్, రుణ సదుపాయాలు సహకారం అందించాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా ఉపాధి అధికారి, ఇంటర్మీడియట్ అధికారి కల్పన ,గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ వెంకటేష్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, వీ హబ్ సమన్వయకర్త, టాస్క్ సమన్వయకర్త కౌసల్య, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు, సఖి బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.