నిరీక్షణ ఫలించేనా..?
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:30 AM
ఎస్సీ యువతీయువకులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించి మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యాక్షన ప్లానను అమలు చేస్తున్నది. మూడేళ్లుగా మూలకుపడ్డ ఈ పథకం ఎట్టకేలకు ఈ సంవత్సరం మార్చిలో మళ్ళీ ముందుకు వచ్చింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఎస్సీ యువతీయువకులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించి మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యాక్షన ప్లానను అమలు చేస్తున్నది. మూడేళ్లుగా మూలకుపడ్డ ఈ పథకం ఎట్టకేలకు ఈ సంవత్సరం మార్చిలో మళ్ళీ ముందుకు వచ్చింది. జీవో నంబరు 3 ద్వారా మార్చి 2026లో ఎస్సీ యాక్షన ప్లానకు ఆమోదం తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళిక మేరకు జిల్లాలో నాలుగు విభాగాల్లో 700 కోట్ల రూపాయలతో 359 యూనిట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇందుకోసం దరఖాస్తులు కూడా స్వీకరించగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి 2,597 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల మేరకు 244 మందిని ప్రాథమికంగా లబ్ధిదారులుగా గుర్తించారు. వీరితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ప్రస్తుతం మండలాల స్థాయిలోనే డాక్యుమెంటేషన పేరిట కాలయాపన జరుగుతోంది. డాక్యుమెంటేషన పూర్తయిన తర్వాత ఆ దరఖాస్తులను ఎంపీడీవోలు జిల్లా ఎస్సీ సంక్షేమ కార్యాలయానికి పంపిస్తే కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లి మంజూరీకి అనుమతి పొందాల్సి ఉంటుంది. జీవో జారీ అయి ఆరు నెలలు దాటినా ఇంకా ఆర్థిక సహాయం మంజూరు, బ్యాంకులకు సబ్సిడీ విడుదల, యూనిట్ల స్థాపన జరగలేదు.
పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక
2026 ఎస్సీ యాక్షన ప్లానప్రణాళికలో ఎలక్ర్టిక్ ద్విచక్ర వాహనాలను, త్రి చక్రవాహనాలను (గూడ్స్ అండ్ ప్యాసింజర్), రెండు పాడి పశువుల యూనిట్, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ యూనిట్లు నెలకొల్పాలని, వీటి ద్వారా ఎస్సి యువతీయువకులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. జిల్లాలో ఎలక్ర్టిక్ ద్విచక్ర వాహనాల విభాగం కింద 169 మందికి లక్ష రూపాయల విలువ చేసే ఎలక్ర్టిక్ ద్విచక్ర వాహనాలను 90 వేల సబ్సిడీతో సమకూర్చుతారు. ఈ పథకంలో జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఊబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై పనిచేసే గిగ్‌వర్కర్లకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధికల్పించాలని నిర్ణయించారు. ఇందుకు వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు 1,020 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 122 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు.
లబ్ధిదారులకు కేటాయించే యూనిట్లు
- ఎలక్ర్టిక్ త్రిచక్ర వాహనాల విభాగంలో ఒక్కో యూనిట్‌కు 3 లక్షల రూపాయల చొప్పున గూడ్స్, ప్యాసింజర్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయించారు. జిల్లాకు 83 యూనిట్లు కేటాయించగా 1167 మంది దరఖాస్తుచేసుకున్నారు. ఇప్పటి వరకు 69 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు.
- రెండు పాడి పశువులను ఒక యూనిట్‌గా పేర్కొంటూ రెండు లక్షల రూపాయల చొప్పున కేటాయించి వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. జిల్లాలో 89 యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా 384 మంది దరఖాస్తుచేసుకున్నారు. ఇప్పటి వరకు 39 మందిని మాత్రమే ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి జిల్లా మంత్రి ఆమోదంతో ప్రభుత్వం అనుమతి కోరుతూ ప్రతిపాదనలను పంపించారు.
- వ్యవసాయ అనుబంధ పథకమైన సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ యూనిట్లను 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయల పెట్టుబడితో నెలకొల్పి, లబ్ధిదారులకు 90శాతం సబ్సిడీ ఇస్తారు. జిల్లాకు 18 యూనిట్లను కేటాయించగా 26 మంది దరఖాస్తుచేసుకున్నారు. వారిలో ఐదుగురిని మాత్రమే గుర్తించారు.
- ఎలక్ర్టిక్ ద్విచక్ర వాహనాలకు లబ్దిదారులు 10 వేల రూపాయలు తమ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం 90 వేలు సబ్సిడీగా యూనిట్‌కు కేటాయిస్తుంది. ఎలక్ర్టిక్ త్రిచక్ర వాహనాలకు ఎంపికైన యువతీయువకులు తమ వాటాగా 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పాడి పశువుల యూనిట్లకు 40వేల రూపాయలు లబ్ధిదారుడి వాటాగా చెల్లించాలి.
అవసరమైన పత్రాలు :
లబ్ధిదారులుగా ఎంపికైన వారు డాక్యుమెంటేషనలో ఆధార్‌కార్డు, రేషనకార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను, రవాణా పథకాలకు ఎంపికైన వారు శాశ్వత డ్రైవింగ్ లైసెన్సును సమర్పించాల్సి ఉంటుంది. వ్యవసాయ పథకాలకు పట్టాదారు పాసుపుస్తకాలను ఇవ్వాలి. సోలార్ పంపుసెట్ పథకానికి కనీసం రెండెకరాల భూమితోపాటు బోరుబావి ఉండాలి. నీటి లభ్యతను ధ్రువీకరిస్తూ గ్రామకార్యదర్శి జారిచేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్లను సమర్పించాలి. పాసుపోర్టుసైజు ఫొటోలను కూడా అవసరం.
యూనిట్లకు అవసరమైన మేరకు మిగతా లబ్దిదారులను కూడా ఎంపిక చేసి త్వరలోనే డాక్యుమెంటేషన ప్రక్రియ పూర్తిచేసి వారివారి ఖాతాల్లో యూనిట్ నెలకొల్పడానికి అవసరమైన డబ్బును ప్రభుత్వం జమ చేయాలని కోరుతున్నారు.