నిర్మలమ్మ కరుణించేనా?
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:54 AM
కేంద్ర బడ్జెట్ ఏలా ఉండబోతుంది.. ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది.. చివరికి ఎవరిపై ప్రభావం చూపబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై ప్రభావం ఉంటుంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కేంద్ర బడ్జెట్ ఏలా ఉండబోతుంది.. ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది.. చివరికి ఎవరిపై ప్రభావం చూపబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై ప్రభావం ఉంటుంది. పార్లమెంట్‌లో ఆదివారం 2026-27 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన ప్రవేశపెట్టే బడ్జెట్‌పె సిరిసిల్ల నేత కార్మికులు, వస్త్రోత్పత్తిదారులు ఈసారైనా తమ కల నెరవేరబోతుందా అని ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్ కోసం విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.
- ఎదురు చూపుల్లోనే ‘మెగా’ పవర్‌లూం క్లస్టర్
కేంద్ర, రాష్ట్రాలను కుదిపేసిన సిరిసిల్ల నేత కార్మికుల బలవన్మరణాలు, అకలి చావుల నేపఽథ్యంలో కేంద్ర ప్రభుత్వ బృందాలు సిరిసిల్లలో పర్యటించి మెగా పవర్‌లూం క్లస్టర్, టెక్స్‌టైల్ జోనగా ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీలు ఇచ్చారు. నేత కార్మికులను అశల్లో ఉంచగా హామీలకే కేంద్రం పరిమితమైంది. ప్రతీ కేంద్ర బడ్జెట్ సమయంలో సిరిసిల్ల నేతన్నలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సిరిసిల్లను మెగా పవర్‌లూం క్టస్టర్‌గా మార్చాలనే ప్రతిపాదనలు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి పంపిస్తూనే ఉన్నారు.
2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావును ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌లు మెగా పవర్‌లూం క్లస్టర్ హామీని పొందారు. అప్పటి బడ్జెట్‌లోనే ప్రకటిస్తారని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. 2004లో తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి వద్ద 60 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును రూ 7.73 కోట్లతో ఏర్పాటు చేశారు. టెక్స్‌టైల్ పార్కులో ఆఽధునిక మరమగ్గాలను స్థాపించారు. దేశ విదేశీ మార్కెట్‌లో అమ్ముడుపోయే విలువైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న పార్కులోకి అనుబంధ పరిశ్రమలు రాకపోవడంతో ఉత్పత్తుల్లో పెద్దగా మార్పులు రాలేదు. సిరిసిల్లలో లో టెక్నాలజీ మరమగ్గాలపై అధునిక ఉత్పత్తులు చేయలేక తరచూ పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూసింది. ఆత్మహత్యలు, సంక్షోభం నేపథ్యంలో సిరిసిల్లలో మార్పులు తీసుకరావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి.
- రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా..
సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌ను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయి బీజేపీ ప్రభుత్వం రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 2016 బడ్జెట్ సమయంలో అప్పుడు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి, అప్పటి చేనేత జౌళిశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసి వస్త్ర పరిశ్రమ సమస్యను వివరించారు. మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి పంపించామని తెలపడంతో ఆ బడ్జెట్‌లో పవర్‌లూం క్టస్టర్ చోటు దక్కుతుందని భావించారు. మొదటి విడతలో దేశంలో ఐదు మెగా క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా సిరిసిల్లకు చోటు దక్కలేదు. 2017 బడ్జెట్ సమయంలో కూడా కేటీఆర్, అప్పటి ఎంపీ వినోద్ చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధించుకునే విధంగా చర్యలు చేపట్టారు. కానీ ఆ బడ్జెట్‌లో కూడా మోక్షం లభించలేదు. 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025 బడ్జెట్‌లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రతీ బడ్జెట్ సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ లేఖలు రాస్తూనే ఉన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వ ఆర్డర్లను అందించింది. బతుకమ్మ చీరల ద్వారా కార్మికులు నెలకు 16వేల రూపాయల నుంచి 18 వేల రూపాయల వరకు వేతనాలు పొందుతూ వచ్చారు.
- ఈ సారైనా ఫలిస్తుందా..
మరోవైపు అపెరల్ పార్కులో గార్మెంట్ పరిశ్రమ మొదలు కావడంతో మహిళలకు ఉపాధి లభిస్తోంది. కార్మికులను యజమానులుగా మార్చేవర్కర్ టు ఓనర్ పథకం సిద్ధమైంది. లబ్ధిదారుల ఎంపిక మిగిలింది. ఇదే దశలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రభుత్వ ఆర్డర్లపై మొదట్లో కొంత సందిగ్ధత ఏర్పడినా మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్‌లు నేత కార్మికుల్లో భరోసా నింపడంతో పాటు స్వశక్తి సంఘాల మహిళలకు చీరల అర్డర్లు, సర్వ శిక్షలో విద్యార్థులకు యూనిఫాం బట్ట అర్డర్లు అందించడంతో పరిశ్రమ మళ్లీ నిలదొక్కుకునే దిశగా అడుగులు పడ్డాయి. చేనేత జౌళి శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఈసారి కూడా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ పంపించారు. అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. ఈసారైనా తమ కల ఫలిస్తుందోమోనని నేతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు.