Share News

‘మధ్యాహ్న భోజనం’ అమలయ్యేదెన్నడో..?

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:38 AM

ఈ యేడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థుల మాదిరిగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉదయాన్నే కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పాఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని నిర్ణయించింది.

‘మధ్యాహ్న భోజనం’ అమలయ్యేదెన్నడో..?

జగిత్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఈ యేడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థుల మాదిరిగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉదయాన్నే కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పాఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర కావస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో తరగతులకు హాజరవుతూ ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు.

జిల్లాలో 16 ప్రభుత్వ కళాశాలలు...

జిల్లాలో మొత్తం 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ యేడాది ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఇప్పటికే 2,692 మంది విద్యార్థులు ఫస్టియర్‌ ప్రవేశాలు పొందారు. గత విద్యా సంవత్సరం (2025-26)లో 2,850 మంది విద్యార్థులున్నారు. ఈసారి 20 శాతం అదనంగా ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశాల్లో రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలో, జగిత్యాల జిల్లా 9వ స్థానంలో ఉందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

ప్రవేశాలకు నెలాఖరు వరకు గడువు

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు గతంలో జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఉండేది. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు అధికారులు గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో ఇంకా చాలా మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉందని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.

ఫప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రబుత్వం అమలు చేస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు కూడా మధ్యాహ్నా భోజన పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని పలు మార్లు హామీ సైతం ఇచ్చింది. అయితే ఆ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్నా భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆకలితోనే తరగతులకు...

-నవీన, ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని, ప్రభుత్వ బాలికల కళాశాల, జగిత్యాల

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించగానే సంతోషించాము. కానీ తరగతులు ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో ఆకలితోనే తరగతులు వింటున్నాము. చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నాము.

త్వరగా ప్రారంభించాలి

-నిశ్వంత్‌, ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి, ఇబ్రహీంపట్నం కళాశాల

త్వరలోనే ప్రాక్టికల్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలోనే ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి త్వరగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలి. మా ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నాము.

ఎలాంటి ఆదేశాలు రాలేదు..

- బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు చేపడుతాము.

Updated Date - Jul 19 , 2026 | 12:38 AM