Share News

‘చేయూత’ నిరీక్షణకు తెరపడేనా..?

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:49 AM

వృద్ధులు, ఇతర బాధితులకు ఆర్థిక భరోసానిచ్చే చేయూత పింఛన్ల పంపిణీకి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు కాస్త భరోసాగా నిలిచే చేయూత పింఛన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు.

‘చేయూత’ నిరీక్షణకు తెరపడేనా..?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వృద్ధులు, ఇతర బాధితులకు ఆర్థిక భరోసానిచ్చే చేయూత పింఛన్ల పంపిణీకి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు కాస్త భరోసాగా నిలిచే చేయూత పింఛన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు. తాజాగా పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి కసరత్తు ప్రారంభించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. నాలుగేళ్లుగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే చేయూత పథకంలో అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు సజీవ నిర్ధారణ సర్వే చేశారు. ఇందులో 9 వేల మంది వరకు అనర్హులను గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవసరం లేదని పేర్కొంటూనే తమ దరఖాస్తులు ఉన్నాయో లేదో పంచాయతీ కార్యదర్శుల వద్ద ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కొత్త వారితోపాటు పాత వాళ్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నుంచి పంపిణీ చేస్తామని ఆశలు చూపినా నిరాశే మిగిల్చారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుడుతూ ఆన్లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. ఈసారైనా పింఛన్‌ తీపి కబురు నెరవేరుతుందా లేదా అని అడుగులు చూస్తున్నారు. ఈసారి చేయూత పథకం పరిధిని విస్తరిస్తూ ప్రస్తుతం ఉన్న 11 కేటగిరీలకు తోడుగా ప్రాధాన్య క్రమంలో దివ్యాంగుల కేటగిరిలో తలసేమియా, సికిల్‌సెల్‌, కిమోపిలియా బాధితులకు పింఛన్లు మంజూరుతో పాటు ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులకు ప్రాధాన్యం ఇస్తారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల మొత్తాన్ని పెంచి ఇస్తామన్న దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగేళ్లుగా దాదాపు దరఖాస్తుదారులు పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్‌ దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అధికారులను నియమించారు. ఈసారి మూడెకరాల మాగాణి, 7.5ఎకరాల మెట్ట భూములు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం మించి ఉన్నవారు, ప్రభుత్వ, ప్రైవేట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్న, ఇప్పటికే ప్రభుత్వ పెన్షన్‌ తీసుకుంటున్న వారు చేయూత పింఛన్లకు అర్హులు కాదని పేర్కొన్నారు.

ఇప్పటికే పింఛన్‌ కోసం 76,501 దరఖాస్తులు

జిల్లాలో గత ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు అందిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి స్థానంలో చేయూత ప్రకటించింది. జిల్లాలో ఆరు గ్యారంటీలకు 1.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ప్రధానంగా పింఛన్‌ కోసం 76501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చేయూత పింఛన్‌కు 71677 మంది, దివ్యాంగులు 4824 మంది దరఖాస్తులు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ప్రకటించిన కాంగ్రెస్‌ పింఛన్‌ సొమ్ము సాధారణ పింఛన్‌దారులకు రూ 4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించినా అమల్లోకి రాలేదు. పెంచడంతో పాటు అర్హులైన వారందరికి పింఛన్లు మంజూరుచేస్తామని స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలిగే తీరు మాత్రం కనిపించడం లేదు. కుటుంబంలో వృద్ధాప్య పింఛన్‌దారులు ఒకరు చనిపోతే వారి కుటుంబంలో భార్యకు గానీ, భర్తకు గానీ పింఛన్‌ మంజూరు చేసి బదలాయింపు పక్రియ మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇది కూడా అందరికి వర్తింపచేయడం లేదు. జిల్లాలో పింఛన్ల కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో ఒకసారి మాత్రమే కొత్తవారికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో చాలా మందికి పింఛన్లు రాలేదని ఎదురుచూశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తుల స్వీకరణతో హడావిడి చేసినా పింఛన్‌ మాత్రం అందడం లేదు. వృద్ధాప్య పింఛన్‌లు మాత్రం ఒకరు మరణిస్తే ఒకరికి అందిస్తున్నారు. ఇందులో కూడా కేవలం వృద్ధప్య పింఛన్‌ మాత్రమే బదలాయింపు చేస్తున్నారు. దివ్వాంగులు, ఇతర చేనేత, గీత కార్మికులు చనిపోతే భార్యలకు వితంతు పింఛన్‌ కింద ఇవ్వడం లేదు. ఈసారి పింఛన్‌ పొందుతున్న దివ్యాంగుడు మరణిస్తే ఆర్థిక సాయం తక్షణమే భార్యకు బదిలీ అయ్యేలా నిబంధనలను సవరించారు.

జిల్లాలో 9010 మంది అనర్హులు..

బడుగు, బలహీన వర్గాలకు జాతీయ, సాంఘిక భద్రతా పథకం ద్వారా అందిస్తున్న చేయూత పింఛన్‌దారుల్లో మరణించిన వారికి సంబంధించిన పింఛన్‌ సొమ్ము కుటుంబ సభ్యులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వివిధ వృత్తులలో ఉన్నవారు పొందుతున్న చేయూత పింఛన్లలో అనర్హులను గుర్తించే దిశగా ప్రభుత్వం తాజాగా సజీవ నిర్ధారణ సర్వే లైవ్‌ అథెంటిఫికేషన్‌ నిర్వహించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రస్థాయిలో లైవ్‌ అథెంటిఫికేషన్‌ ద్వారా నిర్ధారణ సర్వేలో ముందు వరుసలో నిలిచింది. జిల్లాలో ఇప్పటికే వంద శాతం సర్వేను పూర్తిచేశారు. సర్వేలో సర్వేలో మరణించిన వారు, స్థానికంగా ఆచూకీ లభించని పింఛన్‌ లబ్ధిదారులను గుర్తించారు. మృతిచెందిన వారి పింఛన్‌ సొమ్మును నిలిపివేశారు. సర్వేలో 9010 మంది అనర్హులుగా ఉన్నట్లు తెలుస్తుండగా, 2836 మంది మృతిచెందిన వారున్నారు. జిల్లాలో చేయూత పథకంలో 108986 వివిధ రకాల పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. సజీవ నిర్ధారణ సర్వేలో 99976 మంది పింఛన్‌ లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారు. సర్వేలో 2836 మంది పింఛన్‌ లబ్ధిదారులు మృతిచెందినట్లు గుర్తించారు. వివిధ కారణాలతో పరిశీలనలో 9010 పింఛన్లు ఉన్నాయి. బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా కాని వారు 2505మంది ఉన్నారు, నిర్ధారణ కాని 1441, స్థానింగా లేనివారివి 564, ఆధార్‌ ధ్రువీకరణ సరిగా లేనివి 1260 ఉన్నాయి. చేయూత పింఛన్ల సర్వేలో వివిధ కారణాలతో ఓకే కాని లబ్ధిదారులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మరణించిన వారి పింఛన్లు మాత్రమే జాబితాల నుంచి తొలగించి, మిగతా వాటిని పరిశీలించిన అనంతరమే తొలగిస్తారు.

జిల్లాలో సజీవ నిర్ధారణ సర్వేలో ఇలా..

మండలం లబ్ధిదారులు.. అర్హులు మృతులు

బోయిన్‌పల్లి 6706 6048 219

చందుర్తి 6888 6318 204

ఇల్లంతకుంట 7997 7434 190

గంభీరావుపేట 11221 10101 188

కోనరావుపేట 9123 8433 215

ముస్తాబాద్‌ 10425 9457 235

రుద్రంగి 2848 2533 100

సిరిసిల్ల మున్సిపాలిటీ 20512 19117 543

తంగళ్ళపల్లి 8903 8229 180

వీర్నపల్లి 2088 1905 86

వేములవాడ 1775 1507 82

వేములవాడ రూరల్‌ 2785 2592 32

వేములవాడ మున్సిపాలిటీ 6650 6105 261

ఎల్లారెడ్డిపేట 11065 10197 301

మొత్తం 108986 99976 2836

Updated Date - Aug 09 , 2026 | 12:49 AM