Share News

కరీంనగర్‌ ఎవరిదో..?

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:19 AM

రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఏ నోట విన్నా, ఎక్కడ నలుగురు కూర్చున్నా... కార్పొరేషనలో బీజేపీ అధికారం చేపడుతుందా.. కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందా సోమవారం ఏమి జరుగబోతుంది.. అన్న చర్చే వినవస్తుంది.

కరీంనగర్‌ ఎవరిదో..?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఏ నోట విన్నా, ఎక్కడ నలుగురు కూర్చున్నా... కార్పొరేషనలో బీజేపీ అధికారం చేపడుతుందా.. కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందా సోమవారం ఏమి జరుగబోతుంది.. అన్న చర్చే వినవస్తుంది.

మ్యాజిక్‌ ఫిగర్‌ 35

కార్పొరేషనలో 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాలను దక్కించుకోగా, బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో, ఫార్వర్డ్‌బ్లాక్‌ 2 స్థానాల్లో విజయం సాధించాయి. కార్పొరేషన పరిధిలో కరీంనగర్‌ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌, కరీంనగర్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, కవ్వంపల్లి సత్యనారాయణ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 66 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలుపుకొని 69 మంది కార్పొరేషన ఓటర్లుగా ఉన్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవడానికి 35 మంది ఓటు వేయాల్సి ఉంటుంది.

ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యులే కీలకం

ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఇక్కడ ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్‌బ్లాక్‌ కార్పొరేటర్ల మద్దతు కీలకంగా మారింది. వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ఒక అడుగు ముందు వేసింది. ఆ పార్టీ చేసిన ప్రయత్నాలతో ఓట్ల లెక్కింపు జరిగిన రోజే ఒక ఇండిపెండెంట్‌, మరో ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యురాలు బీజేపీలో చేరారు. వారు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో పార్టీలో చేరినట్లు బీజేపీ ప్రకటించింది. మరుసటి రోజు 17, 39 డివిజన కార్పొరేటర్లు వేముల కవితచంద్రశేఖర్‌, మాసం గణేశ బీజేపీలో చేరినట్లు ప్రకటించి మీడియాకు ఫొటోలు విడుదల చేశారు. వీరి చేరికతో బీజేపీకి 34 మంది కార్పొరేటర్ల బలం చేకూరింది. ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఓటుతో కలుపుకొని 35 ఓట్లు కాగా, ఆ పార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకోవడం లాంఛనప్రాయమేనని అందరూ భావించారు.

బీజేపీకి మద్దతివ్వబోమంటున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతలు

కరీంనగర్‌లో 14 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఎంఐఎం అభ్యర్థులు ముగ్గురు. మొత్తం కలిపినా 17 మంది. సాధారణంగా అందరూ ఆ పార్టీకి అవకాశాలు లేవు అని అనుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ పెద్దలు రంగ ప్రవేశం చేశారు. కరీంనగర్‌ కార్పొరేషనను దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా భావించిన ఆ పార్టీ తమ సభ్యులతోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యుడిని క్యాంపునకు తరలించారు. మిగిలిన ఇద్దరు ఇండిపెండెంట్లను క్యాంపునకు తరలించారు. ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర, జిల్లా నాయకులతో మంతనాలు జరిపి వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల కారణంగా ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర కన్వీనర్‌ అంబటి జోజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు తేజ్‌దీప్‌రెడ్డి, కార్యదర్శి బండారి శేఖర్‌ తమ కార్పొరేటర్లకు సమావేశానికి హాజరుకావాలని విప్‌ జారీ చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము ఎట్టిపరిస్థితుల్లో బీజేపీకి మద్దతిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మత రాజకీయాలను రెచ్చగొట్టే బీజేపీ ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని ప్రకటించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముందు ఎవరికి ఓటు వేయాలో పార్టీ విప్‌ జారీ చేస్తుందని, పార్టీ విప్‌ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని తెతిపారు. క్యాంపుల్లో ఉన్న సభ్యుల ఇళ్లకు వెళ్ళి విప్‌ నోటీసులు అంటించారు. దీంతో ఫార్వర్డ్‌బ్లాక్‌ మద్దతు కాంగ్రెస్‌కేనని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

భర్త బీజేపీ క్యాంపులో.. భార్య కాంగ్రెస్‌ క్యాంపులో..

బీజేపీ క్యాంపులో 15వ డివిజనలో గెలుపొందిన సాయి జ్యోతి భర్త ఉండగా, కాంగ్రెస్‌ క్యాంపులో 20వ డివిజన కార్పొరేటర్‌ శ్యామల ఉన్నారు. ఆదివారం ఫార్వర్డ్‌బ్లాక్‌ నేతలు తమ సభ్యుల ఇళ్ల్ళకు విప్‌ నోటీసులు అంటించగానే 15వ డివిజన కార్పొరేటర్‌ సాయిజ్యోతి కాంగ్రెస్‌ క్యాంపునకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్‌ క్యాంపునకు వెళ్లినట్లు తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు ఆమె ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్‌ చర్యలను నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సభ్యురాలి చేరికతో కాంగ్రెస్‌ మద్దతుదారుల బలం 35కు చేరింది. వీరిలో కాంగ్రెస్‌ సభ్యులు 14 మంది, బీఆర్‌ఎస్‌ 9 మంది, ఎంఐఎం 3, ఫార్వర్డ్‌బ్లాక్‌ -2, ఇండిపెండెంట్లు-5 ఉన్నారు. వీరికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలిద్దరి ఓట్లు ఉన్నాయి. ఒకే ఒక్క ఓటు మార్పుతో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి అధికారం చేపట్టే దిశగా నడుస్తున్నది. అన్నీ సజావుగా జరిగితే అధికారం వారి పరమవుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ కార్పొరేషనను కైవసం చేసుకుంటుంది. సోమవారం కార్పొరేషనలో ఏమి జరుగబోతుంది, ఫార్వర్డ్‌బ్లాక్‌ కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తుందా, అందరూ హాజరవుతారా, ఇండిపెండెంట్లు చివరి క్షణంలో ఎవరికి ఓటు వేసి ఎవరి తలరాతలు మారుస్తారు అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి చర్చల్లో నానుతున్నాయి.

మేయర్‌ పీఠంపై ఎవరు?

బీజేపీ మేయర్‌ అభ్యర్థులుగా అధికారికంగా ఎవరినీ ప్రకటించకపోయినా వాసాల రమేశ, కొలగాని శ్రీనివాస్‌, బండారి వేణు పేర్లు, డిప్యూటీ మేయర్‌ పదవికి వై.సునీల్‌రావు, బోయినపల్లి ప్రవీణ్‌రావు, వంగల పవనకుమార్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఉన్న బీజేపీలో బండి సంజయ్‌కుమార్‌ చెప్పిన వారే పదవుల్లోకి వచ్చే అవకాశమున్నది. ఒకవేళ కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి పదవి దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై మండిపడుతున్నారు. ఈ రకమైన చర్చ కూడా రాజకీయవర్గాల్లో, ఇతర వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రతిరోజు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌లో అధికారం కోసం కలువడమేమిటనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికి చెక్‌పెట్టడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు మాస్టర్‌ ప్లాన వేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన వివేకానంద విద్యాసంస్థల అధినేత సౌగాని కొమురయ్యను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించి, ఆయనకు అందరూ మద్దతు తెలిపే అవకాశం ఉన్నది. బీఆర్‌ఎస్‌ కానీ ఎంఐఎం కానీ డిప్యూటీ మేయర్‌ పదవి తీసుకుంటాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే కరీంనగర్‌ కార్పొరేషన పీఠంపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి కూర్చొనే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు మేయర్‌ పీఠం దక్కితే ఎవరైతే బాగుంటుందని మంత్రులు అభిప్రాయ సేకరణ చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో మల్లికార్జున రాజేందర్‌, వైద్యుల అంజనకుమార్‌ పేర్లను పలువురు సభ్యులు ప్రతిపాదించారని సమాచారం. సోమవారం మధ్యాహ్నం వరకు కరీంనగర్‌ మేయర్‌ ఎవరికి దక్కుతుందో తెలిసిపోతుంది.

Updated Date - Feb 16 , 2026 | 01:19 AM