పీఠం దక్కేదెవరికో..?
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:17 AM
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.
జగిత్యాల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. ఇదే సమావేశంలో తొలుత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారంతో పాటు, పరోక్ష పద్ధతిలో కీలక పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి కానుంది. చేతులెత్తే విధానం ద్వారా చైర్మన్లను నిర్ణయిస్తారు. ఇక్కడే ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి పోయాయి.
ప్రత్యేకాధికారుల నేతృత్వంలో ఎన్నిక..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేకాధికారులను నియామకం చేశారు. జగిత్యాల మున్సిపల్ ప్రత్యేకాధికారిగా అడిషనల్ డీఆర్‌డీవో, ధర్మపురి మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జగిత్యాల ఆర్‌డీవో, మెట్‌పల్లి మున్సిపల్ ప్రత్యేకాధికారిగా మెట్‌పల్లి ఆర్‌డీవో, కోరుట్ల మున్సిపల్ ప్రత్యేకాధికారిగా కోరుట్ల ఆర్‌డీవో, రాయికల్ మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జడ్పీ సీఈవోలను నియమించారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉన్నతాధికారులు ఆయా మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికను పరిశీలించనున్నారు.
కోరం సభ్యులు హాజరైతేనే...
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కోరం సభ్యులు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రత్యేక సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి గంట పాటు కోరం సభ్యుల కోసం అధికారులు వేచి ఉంటారు. గంట లోపు కోరం సభ్యులు హాజరుకాకపోతే ఈనెల 17వ తేదీకి ఎన్నికను వాయిదా వేస్తారు. మున్సిపాలిటీల్లో గల వార్డు కౌన్సిలర్లలో సగం సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడే కోరం ఉన్నట్లుగా అధికారులు నిర్ణయిస్తారు. ఒకవేళ కోరం లేకుండా ఎన్నిక వాయిదా అయితే మరుసటి రోజు సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు సైతం కోరం సభ్యులు హాజరుకానట్లయితే పరిస్థితిని ప్రత్యేకాధికారి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే తదుపరి నిర్ణయం మేరకు ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది.
పార్టీల విప్‌నకు కట్టుబడి..
మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులుగా విజయం సాధించిన కౌన్సిలర్లు తమ పార్టీలు జారీ చేసే విప్‌కు కట్టుబడి చేతుల ఎత్తడం ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ను ధిక్కరించినట్లయితే సభ్యుడు పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ సంబంధిత సభ్యుడు వేసిన ఓటు చెల్లుబాటు అవుతుంది. విప్ నిబంధనను అమలు చేయడానికి మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో జరిగిన సంఘటనల యొక్క వివరణాత్మక వీడియో రికార్డులను అధికారులు నిర్వహిస్తారు.
ఫప్రత్యేక రికార్డుల నిర్వహణ..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి నియామకమైన ప్రత్యేకాధికారి పలు రికార్డులను నిర్వహిస్తారు. ఎన్నికైన సభ్యులు, ఎక్స్‌అఫిషియో సభ్యుల పేర్లు, వారి పార్టీ అనుబంధాలు, ప్రత్యేక సమావేశానికి హాజరైన సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. సమావేశానికి గైర్హాజరైన సభ్యుల వివరాలు, పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన వారి వివరాలు, సమావేశానికి హాజరై ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారి వివరాలు తదితర రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు.
పక్కాగా సీటింగ్ ఏర్పాటు..
మున్సిపల్ వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికయిన సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యుల సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సూచనలు చేసింది. ప్రత్యక్షంగా ఎన్నికయిన సభ్యులకు వారివారి పార్టీ శ్రేణుల వారీగా కూర్చోబెడతారు. గుర్తింపు పొందిన ప్రతి జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ఎన్నికైన సభ్యులకు ప్రత్యేక కంపార్ట్‌మెంట్లలో సీట్లు కేటాయిస్తారు. స్వతంత్రంగా ఎన్నికయిన సభ్యులకు ప్రత్యేక కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేస్తారు. నమోదైన రాజకీయ పార్టీలు, స్వతంత్ర సభ్యులు వారి సంబంధిత గ్రూపులలోని సభ్యుల పేర్లను తెలుగు అక్షర క్రమంలో సూచిస్తారు. సులభంగా గుర్తించడానికి ప్రతి కంపార్ట్‌మెంట్ ముందు ఒక డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేస్తారు.
ఫనమోదైన ఎక్స్ అఫీషియో ఓట్లు...
జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుగుణంగా పలువురు ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ధర్మపురి మున్సిపల్‌లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కాంగ్రెస్ తరపున మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మెట్‌పల్లిలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా బీఆర్‌ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగిత్యాలలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని ప్రకటిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరి సంజయ్ కుమార్, బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ ఎల్.రమణలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుగుణంగా పలువురు ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నట్లు అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు.
భారీ బందోబస్తు...
జిల్లా కేంద్రంలోని జగిత్యాల మున్సిపల్‌తో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపల్ కార్యాలయాల వద్ద చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ ప్రయోజనాల కొరకు బెదిరింపులు, చట్ట విరుద్దమైన నిర్బంధాలకు సభ్యులు గురికాకుండా ఎన్నికయిన సభ్యులు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయాలకు కొద్ది దూరంలోనే బారీకేడ్లు ఏర్పాటు చేసి అనుమతి పొందిన వ్యక్తులు మినహా ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తగా ఎన్నికయిన మున్సిపల్ కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీసులు సహకారాలను అందించనున్నారు. జిల్లా ఎస్‌పీ అశోక్ కుమార్ ఆద్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తును నిర్వహించనున్నారు.