Share News

కో-ఆప్షన్‌ దక్కేదెవరికో..?

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:35 AM

మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవికి నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవుల వైపు మళ్లింది. ఇంతకాలం నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం లభించనుంది.

కో-ఆప్షన్‌ దక్కేదెవరికో..?

జగిత్యాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవికి నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవుల వైపు మళ్లింది. ఇంతకాలం నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం లభించనుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరడంతో కో-ఆప్షన్‌ పదవులపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని, ఎన్నికల సమయంలో కష్టపడిన సీనియర్‌ నేతలు, ముస్లిం మైనారిటీలకు కో-ఆప్షన్‌ పదవులు ఇస్తామని అధికార, విపక్ష పార్టీలు సైతం బుజ్జగింపులు చేశాయి. ఐదు మున్సిపాలిటీలకు గాను రాయికల్‌ మినహా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి మున్సిపాలిటీల్లో అధికార పార్టీ పాగా వేసింది. రాయికల్‌ మున్సిపాలిటీని మాత్రం బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది.

ఫఐదు మున్సిపాలిటీల్లో బలాబలాలు..

జగిత్యాల బల్దియాలో 50 వార్డులు ఉండగా కాంగ్రెస్‌ 23, బీజేపీ 6, బీఆర్‌ఎస్‌ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజయం సాధించారు. మెట్‌పల్లిలో 26 మంది కౌన్సిలర్లకు గాను బీజేపీ 10, బీఆర్‌ఎస్‌ ఆరు, కాంగ్రెస్‌ ఆరు, స్వతంత్రులు నలుగురు గెలుపొందారు. రాయికల్‌ మున్సిపల్‌లో 12 స్థానాలకు గాను మూడు కాంగ్రెస్‌, ఐదు బీజేపీ, మూడు బీఆర్‌ఎస్‌, ఒకరు స్వతంత్రులు గెలుపొందారు. ధర్మపురిలో 15 స్థానాలకు గాను మొత్తం కాంగ్రెస్‌ కైవసం చేసుకొని క్లీన్‌ స్వీప్‌ చేసింది. కోరుట్లలో 33 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 18, బీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 6, స్వతంత్రులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

అర్హతలు..

మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికలో పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో నలుగురు సభ్యులను నియమించిన పక్షంలో వారిలో పరిపాలన అనుభవం కలిగిన వారికి రెండు పోస్టులు కేటాయిస్తుండగా...అందులో రెండు మహిళలకు కేటాయిస్తారు. కో-ఆప్షన్‌ సభ్యుడి పోస్టుకు దరఖాస్తు చేసేందుకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఓటరు జాబితాలో రిజిష్టర్‌ అయి ఉండడంతో పాటు 21 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి. అలాగే మైనారిటీ వర్గానికి చెందిన వారికి కూడా కేటాయిస్తారు. అందులో కూడా ఒక పోస్టును మహిళకు రిజర్వు చేసే అవకాశం ఉంది. ఈ పదవులకు దరఖాస్తులు చేసే అభ్యర్థులు ఓటరు జాబితాలో రిజిష్టర్‌ అయి ఉండడంతో పాటు 21 సంవత్సరాలు పైబడి వయస్సు ఉండాలి. ఆశావహులు మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. అన్ని అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాలతో పాటు రుజువు పత్రాలతో నిర్ణీత తేది లోపు కమిషనర్‌ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ముస్లిం మైనారిటీ, క్రిష్టియన్‌ మైనారిటీ వర్గానికి చెందిన వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు, పాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసి గెజిటెడ్‌ అధికారి హోదాలో రిటైర్‌ అయిన ఉద్యోగులు, ఐదేళ్ల కన్నా తక్కువ కాకుండా పరిపాలన అనుభవం కలిగిన మాజీ ప్రజాప్రతినిధులు కో-ఆప్షన్‌ సభ్యుల పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఉంటారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఐదేళ్లు పనిచేసిన ప్రజా ప్రతినిధులు సైతం అర్హులుగా ఉంటారు.

కౌన్సిలర్లతో సమాన హోదా..

కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి కౌన్సిలర్లతో పాటు సమానంగా హోదా, అధికారాలు ఉంటాయి. గౌరవ వేతనం కూడా లభిస్తుంది. మున్సిపల్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సమాజంలో తగిన ప్రాతినిథ్యం లేని మైనారిటీలకు భాగస్వామ్యం చేసేందుకు ఈ పదవులను కట్టబెడతారు. వీరి ఎంపికకు మున్సిపాలిటీ పాలకవర్గం కొలువు దీరిన, తొలి సమావేశం నిర్వహించిన 45 రోజుల్లో నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉండగా అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పదవులు ఆశించిన పలువురు ఆశావహులు ప్రజాప్రతినిధులు, చైర్మన్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఫమున్సిపల్‌ చట్టం 2019 ప్రకారం..

తెలంగాణ మున్సిపల్‌ చట్టం 2019 ప్రకారం కో-ఆప్షన్‌ సభ్యులను నియమిస్తారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో మాత్రం వీరికి ఓటు హక్కు ఉండదు. కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు 45 రోజుల్లోపు మున్సిపల్‌ కమిషనర్‌లు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మైనారిటీ కోటాలో పోటీ పడే వారు తమ కుల ధ్రువీకరణ పత్రం జతచేస్తే మున్సిపల్‌ కమిషనర్‌ పరిశీలిస్తారు. ఎక్కువ మంది పోటీలో ఉంటే కౌన్సిలర్లతో ఓటింగ్‌ నిర్వహించాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీ పాలకవర్గం ఉన్నంత వరకు వీరు పదవుల్లో కొనసాగుతారు. వరసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది.

నేతల చుట్టూ ప్రదక్షిణలు..

మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవులను ఆశిస్తున్న వ్యక్తులు ఆయా పార్టీలకు చెందిన నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలను కలుస్తూ కో ఆప్షన్‌ పదవిని తనకు కేటాయించాలని కోరుతున్నారు. దీనికి తోడు ఇటీవల బాధ్యతలను చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను కలిసి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లతో ముందస్తుగా మంతనాలు జరుపుతూ ఒకవేళ ఓటింగ్‌ జరిగితే మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే..

- రాజాగౌడ్‌, అదనపు కలెక్టర్‌

జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవుల భర్తీ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికను పకడ్బందీగా పూర్తి చేస్తాం.

Updated Date - Apr 05 , 2026 | 12:35 AM