డీసీసీ కార్యవర్గాన్ని నియమించేదెన్నడో..?
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:48 AM
అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం, కమిటీల నియామకంలో జాప్యం చేస్తుండడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటించింది.
జగిత్యాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం, కమిటీల నియామకంలో జాప్యం చేస్తుండడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటించింది. అయితే జగిత్యాల జిల్లాలో మాత్రం ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇటీవల ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14జిల్లాల్లో పూర్తి స్థాయి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ప్రకటిం చారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రెటరీలు, ట్రెజరర్, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో పాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. జగిత్యాల జిల్లాలో డీసీసీ అధ్యక్షుడి జాబితాతో ఆగిపోయింది. పూర్తి స్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.
ఫకార్యవర్గం నియామకంపై తర్జనభర్జన
డీసీసీ అధ్యక్షుడిని 2025 నవంబరు 22వ తేదీన ప్రకటించారు. జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గాజంగి నందయ్యకు డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అప్పగించింది. పూర్తి స్థాయి కార్యవర్గం కాని, అనుబంధ కమిటీలు గాని నియామకం జరగలేదు. దీంతో జిల్లాలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలకకు గురికాగా, కేడర్‌లో తర్జన భర్జన జరిగింది. తాజాగా పూర్తి స్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారుసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.
సమన్వయం కుదరక పెండింగ్
నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షుడిని నియమించిన కాంగ్రెస్ అధిష్ఠానం పలు జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్‌లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపడంలో సమన్వయం కుదరనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్ఠానం జగిత్యాల జిల్లా కమిటీని మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టుల్లో కలిపి 30నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నారని చెబుతున్నారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం సైతం ప్రభావం చూపుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అసంతృప్తికి గురికావడం, కాంగ్రెస్ రాజీనామాకు దారి తీయడం చోటుచేసుకుంది. జిల్లాలో కీలక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతల మద్య పొసగక పోవడం వల్ల పలు ప్రాంతాల నుంచి కూడా జంబోజెట్ జాబితా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ జాబితాలు అధిష్ఠానం పరిశీలనలోనే ఉండగా జగిత్యాల జిల్లా జాబితా ప్రకటనపై మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు కార్యకర్తలు అంటున్నారు. చాలాచోట్ల గ్రూప్ రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, నేతలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎమ్మెల్యే స్థాయి నేతలు, స్థానిక నేతల మధ్య ఆదిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది.