Share News

పంటల బీమా అమలెప్పుడు...?

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:36 AM

రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం నిలిచిపోయిన పంటల బీమా పథకాన్ని పునరుద్ధ రిస్తామని ప్రకటించిన అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా కూడా పథకం అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2026-27 బడ్జెట్‌లో పంటల బీమా పథకం అమలు చేసేందుకు 1896 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, అది కాగితాలకే పరిమితం అవుతు న్నట్లు కనబడుతున్నది.

 పంటల బీమా అమలెప్పుడు...?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం నిలిచిపోయిన పంటల బీమా పథకాన్ని పునరుద్ధ రిస్తామని ప్రకటించిన అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా కూడా పథకం అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2026-27 బడ్జెట్‌లో పంటల బీమా పథకం అమలు చేసేందుకు 1896 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, అది కాగితాలకే పరిమితం అవుతు న్నట్లు కనబడుతున్నది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థి తులు నెలకొన్నాయి. ఇక వర్షాలు పడే స్థితి లేదని వాతావరణ కేంద్రం నిపుణులు చెబుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు పంటలు వేసిన రైతులు సాగు నీరందక పంటలు ఎండిపోతే తమ పరిస్థితి ఏమి టని ఆందోళన చెందుతున్నారు. పంటల బీమా పథకం అమల్లో ఉంటే భరోసా ఉండేదని అంటున్నారు.

జిల్లాలో రెండు లక్షల 80 వేల ఎకరాల పైచిలుకు సాగు భూములు ఉన్నాయి. వీటిలో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని సుమారు లక్షా 70 వేల ఎకరాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుండగా, 20 వేల ఎకరాల కు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అందుతోంది. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల ద్వారా 50 వేల ఎకరాలకు పైగా, వర్షాధారంగా 20 నుంచి 30 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో 2 లక్షల 70వేల ఎకరాల్లో, యాసంగిలో 2 లక్షల 15 వేల ఎకరాల వరకు పంటలు సాగవుతున్నాయి. యేటా భారీ వర్షాలు, ఆకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక పంటలను రైతులు నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఎప్పుడో ఒకసారి నష్టపరిహారాన్ని అందిస్తుండగా, నామమాత్రంగానే పంట నష్టపరిహారం సర్వే జరుగుతున్నది.

2019-20 వరకే అమలైన పథకం..

రాష్ట్రంలో పంటల బీమా పథకం 2019-20 సంవత్సరం వరకు మాత్రమే అమలైంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంగా అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ప్రీమియం చెల్లిస్తే, రైతులు తమ వాటా కింద 10 శాతం ప్రీమియం చెల్లించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. జిల్లాలో ప్రత్యేక రైతులు పంటల సాగు కోసం జూన్‌, జూలై మాసాల్లో వంట రుణాలు తీసుకుంటారు. అదే సమయంలో రైతులు పండించే వం టలకు బీమా చేస్తుంటారు. బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాల నుంచి రైతుల వాటాను మినహాయించుకుని వారు పండించే పంటలను బీమా పథకంలో చేరుస్తారు. ఈ పథకంలో కొన్ని పంటలు గ్రామ యూనిట్‌గా, కొన్ని మండల యూనిట్‌గా అమలు చేశారు. ఈ పథకంలో లొసుగులు ఉన్నాయని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దీనిని సవరించాలని సూచనలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం సవరణను చేయకపోవడంతో పంటల బీమా పథకం నుంచి ప్రభుత్వం తప్పుకున్నది. 2019-20 నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేదు. రైతు లు పంట నష్టపోతే ప్రభుత్వం కేవలం ఎకరానికి 6 వేల చొప్పున, ఆ తర్వాత 10 వేల రూపాయల చొప్పున అందజేస్తూ వచ్చింది. ఈ పరిహారం కూడా పూర్తిస్థాయిలో చెల్లించకుండా నామమాత్రంగానే చెల్లించింది.

బడ్జెట్‌లో నిధులు కేటాయించినా కూడా..

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ పథకాన్ని ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్నది. మార్చిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రకటించిన బడ్జెట్‌లో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు 1886 కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయిస్తు న్నట్లు ప్రకటించించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ పథకం అమలు ఊసెత్తడం లేదు. ఈ సీజన్‌లో పంటల సాగు దాదాపుగా పూర్తయ్యింది. జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి పంటను సాగు చేశారు. కొద్ది కొద్దిగా పడిన వర్షాలకు ఎస్సారెస్పీ ఆయకట్టు కింద వరి పంటను సాగు చేస్తు న్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఎస్సారెస్పీలోకి సరిపడా నీళ్లు రాకపో వడంతో ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదు. నీటిని వదల కుంటే పంట చేతికి రావడం కష్టంగానే మారనున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పంట ఎండిపోయే నష్టం వాటిల్లితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. పంటల బీమా పథకం అమల్లో ఉంటే తద్వారా పరిహారం వస్తుందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుక రావాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:36 AM