ధాన్యం నిల్వలకు చోటేది?
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:31 AM
జిల్లాలో రబీ సీజన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సీజన ధాన్యం నిల్వలకు స్థలాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. గత సీజనలో ధాన్యం పలు మిల్లుల్లో పేరుకుపోయి ఉంది. కొత్త ధాన్యం రావడంతో నిల్వ స్థలం కొరత తీవ్రంగా ఉంది. ఆరు బయట, మిల్లుల వద్ద టార్పాలిన్ల కింద ధాన్యాన్ని నిల్వ చేశారు.
జగిత్యాల, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీ సీజన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సీజన ధాన్యం నిల్వలకు స్థలాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. గత సీజనలో ధాన్యం పలు మిల్లుల్లో పేరుకుపోయి ఉంది. కొత్త ధాన్యం రావడంతో నిల్వ స్థలం కొరత తీవ్రంగా ఉంది. ఆరు బయట, మిల్లుల వద్ద టార్పాలిన్ల కింద ధాన్యాన్ని నిల్వ చేశారు. దీనివల్ల తేమతో ధాన్యం మొలకలు రావడంతోపాటు, పాడైపోతోంది. ఇప్పుడు కొనుగోలు చేయబోయే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరో వైపు ఎంత ధాన్యం మిల్లుల్లో పడుతుందో అంతే తాము తీసుకుంటామని మిల్లర్లు పేర్కొంటున్నారు. సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసేందుకు మిల్లుల్లో నిల్వ కొరత వేధిస్తోంది. పెద్దఎత్తున వడ్లు రానున్న నేపథ్యంలో నిల్వ చేసేందుకు గోదాములు ఎక్కడ..? అన్నది పెద్ద సమస్యగా మారింది. సకాలంలో రైస్ మిల్లులు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో గత యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. వీటి ప్రభావం ప్రస్తుతం కొనుగోళ్లపై పడే అవకాశం ఉంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
కేటాయింపులు సక్రమంగా చేస్తేనే...
అధికారులు మిల్లు సామర్థ్యం, నిల్వల ఆధారంగా ధాన్యం కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగు జిల్లాలోని మిల్లులకు కొంత మొత్తం పంపితే ఇబ్బందులు నుంచి బయటపడవచ్చని అంటున్నారు. గతంలో సైతం పొరుగు జిల్లాలకు ఇక్కడి ధాన్యం పంపారు. అదేమాదిరిగా ప్రస్తుత సీజనలోనూ పొరుగు జిల్లాలకు ఇక్కడి ధాన్యం పంపాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జాప్యంతో తంటాలు..
ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోవడంలో జాప్యం చేస్తుండడంతో మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు నెలలుగా కేటాయింపులు లేకపోవడంతో మిల్లింగ్ కూడా నిలిపివేశారు. హమాలీలు సైతం ఇతర పనులను వెతుక్కుంటున్నారు. గత సీజనలోనే ధాన్యం నిల్వలకు చోటు లేకపోవడంతో కొందరు మిల్లర్లు ఇతర గోదాంలు, కోళ్ల ఫారాలు, వ్యవసాయ మార్కెట్ గిడ్డంగులు, ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని నిల్వలు చేశారు.
మూడు సీజన్ల ధాన్యం పేరుకుపోయి..
జిల్లాలో యేటా వానాకాలం, యాసంగి సీజన్లలో సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. రెండు సీజన్లలో కలిపి సుమారు 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుంది. ఈ బియ్యాన్ని నిల్వ చేయడం అటు మిల్లర్లకు ఇటు ఫుడ్ కార్పొరేషన ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నిర్వాహకులకు ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటికే మూడు సీజన్ల ధాన్యం బస్తాలు మిల్లుల్లో ఉన్నాయి. 2022-23 వేలం ధాన్యం, 2024-25 రబీ సీజన, 2025-26 వానాకాలం సీజన ధాన్యం మిల్లుల్లో ఉన్నాయి. మిల్లర్ల నుంచి సకాలంలో బియ్యం తీసుకోకపోవడం, నిబంధనలు ఎప్పటికప్పుడు మారడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి.
ఎంత అవసరం ఉంటే అంతే..
ప్రస్తుత యాసంగి సీజనలో మిల్లర్లకు ఎంత ధాన్యం అవసరం ఉంటే అంతే కేటాయిస్తారు. మిగితా ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తారు. ఆయా మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మరో 20 రోజుల్లో ఎంత బియ్యం బయటకు వెళ్తుంది... ఎంత స్థలం ఖాళీ అవుతుందో అంచనా వేశారు. దాని ప్రకారమే మిల్లులకు ధాన్యం కేటాయిస్తారు. జిల్లాలో ఖాళీగా ఉన్న గోదాముల వివరాలు సేకరించారు. ఇప్పటికే మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి తదితర ప్రాంతాల్లో గోదాములను సందర్శించి పరిశీలన జరిపారు. కాగా జిల్లాలో సరియైున సమయంలో సీఎంఆర్ బియ్యం అప్పగించని డీఫాల్ట్ అయిన పలు మిల్లులను గుర్తించారు. ఐకేపీ గోదాములు కూడా తీసుకుంటున్నారు. మొక్కజొన్న నిల్వ ఉంచి గోదాములను సైతం పరిశీలించారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని గోదాములల్లో నిల్వ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా...
జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఐకేపీ గోదాములు, ముత్యంపేట షుగర్ కర్మాగారానికి సంబంధించిన గోదాములు పరిశీలించారు. ఎనడీఎస్‌ఎల్ గోదాములు శిథిలావస్థకు గురికావడం వల్ల వాటిని మరమ్మతు చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 90 రైస్ మిల్లులకు యాసంగి ధాన్యం అప్పగించాలని నిర్ణయించారు. అయితే సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వచేసే స్థలం మిల్లుల్లో ఉన్నట్లు అంచనా ఉంది. ఆరుబయట లాట్ పద్ధతిలోనైనా రైస్ మిల్లుల్లో అదేవిధంగా కరీంనగర్‌లోని ప్రభుత్వ గోదాములు, సిరిసిల్ల జిల్లాలో గల ఐకేపీ గోదాములల్లో నిల్వ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల సామార్థ్యం గల ఐకేపీ గోదాములు, 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఎనడీఎస్‌ఎల్ గోదాములను పరిశీలించారు. మిగిలిన సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లి, ఇతర జిల్లాల్లో నిల్వ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కత్తిమీది సాములా..
జిల్లాలో యాసంగిలో 505 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో 93 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు కొనుగోలులో భాగస్వామ్యం అవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే మిల్లుల్లో ఖాళీ స్థలం లేకపోవడంతో ప్రస్తుత యాసంగి సీజన ధాన్యం కొనుగోళ్లలో భాగస్వామ్యం అయ్యే పరిస్థితి లేదని, మినహాయింపు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఇటీవల జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతకు రైస్ మిల్లర్ల అసోసియేషన సభ్యులు వినతిపత్రాలు అందించారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ధాన్యం సేకరణ కత్తిమీది సాములా తయారయిందన్న అభిప్రాయలున్నాయి.
జాగ్రత్తలు తీసుకుంటున్నాము
- జితేందర్‌రెడ్డి, జిల్లా సివిల్ సప్లయి అధికారి
జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజనలో ధాన్యం సేకరణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మిల్లుల్లో ధాన్యం నిల్వకు గల సామర్థ్యం ఎంత.. ప్రస్తుతం మిల్లుల్లో ఎంత వరకు నిల్వ చేసే అవకాశాలున్నాయో పరిశీలన జరుపుతున్నాము. ప్రత్యామ్నయంగా ఐకేపీ గోదాములు, ఎనడీఎస్‌ఎల్ గోదాములను పరిశీలించాము. అవసరమైతే సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాలకు ధాన్యం పంపి నిల్వ చేయాలని యోచిస్తున్నాము.