వీ-హబ్ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:02 AM
వీ-హబ్ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం వీ-హబ్ నైపుణ్యాల శిక్షణా కేంద్రంలో సెర్ఫ్ సంస్థకు చెందిన ఏపీఎంలు, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షులకు వీ-హబ్ కార్యక్రమాలపై నిర్వహించిన టీఓటీ ఓరియంటేషన్ శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): వీ-హబ్ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం వీ-హబ్ నైపుణ్యాల శిక్షణా కేంద్రంలో సెర్ఫ్ సంస్థకు చెందిన ఏపీఎంలు, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షులకు వీ-హబ్ కార్యక్రమాలపై నిర్వహించిన టీఓటీ ఓరియంటేషన్ శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలకు కొత్త వ్యాపార నైపుణ్యాలు నేర్పించి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి జిల్లాలో వీ-హబ్ నైపుణ్యాల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, ఉత్పత్తులకు బ్రాండింగ్, లేబులింగ్, మార్కెట్లో స్థిరపడడం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పటికే చిన్న స్థాయిలో వ్యాపారం చేస్తున్న మహిళలు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. డిగ్రీ, బీటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న యువతులకు ఉద్యోగ అవకాశాల కోసం అవసరమైన ఇంటర్వ్యూ నైపుణ్యాలు ఈ కేంద్రంలో అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సెర్ఫ్ సిబ్బంది, మండల సమాఖ్య అధ్యక్షులు సమిష్టిగా కృషి చేయాలని, వీహబ్ అధికారులు ఈ దిశగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. డీఆర్‌డీవో కాళిందిని, అదనపు డీఆర్‌డీఓ బి రవీందర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న, వీ-హబ్ డైరెక్టర్ జైహింద్, అసోసియేట్ డైరెక్టర్ ఉష, ప్రోగ్రాం మేనేజర్లు తాజ్, అబిద్, శివ పాల్గొన్నారు.