ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:02 AM
దర్యాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.
ముత్తారం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): దర్యాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ రైతుల అంగీకారం, సహకారంతో భూసేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టప్రకారం భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి లభించడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులందరూ సర్వేకు సహకరించాలని కోరారు. రైతులు మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడాలనేది తమ ఉద్దేశం కాదని, 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని, భూసేకరణతో ఉపాధి కోల్పోతామన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రామగిరి మండలంలోని రత్నాపూర్ వద్ద ఓ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు సేకరించి, పరిహారం కింద ఏ విధంగా చెల్లించారో అదేవిధంగా తమకు చెల్లిస్తేనే భూములు ఇస్తామని స్పష్టం చేశారు. పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా భూసర్వే చేపట్టి భూమిని సేకరిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మంథని సీఐ బుద్దె స్వామి, ఎస్‌ఐలు ఎన్.రవికుమార్, శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నూనె కుమార్, మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, లక్కారం సర్పంచ్ అత్తె చంద్రమౌళి, దరియాపూర్ మాజీ సర్పంచ్ గాదం స్రవంతి శ్రీనివాస్, సింగల్ విండో మాజీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, శేరు రమేష్, రైతులు తిత్తుల శ్రీనివాస్, జంగ స్వామి, నరేష్ తదితరులున్నారు.