రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కలిసి కట్టుగా పని చేయాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:10 AM
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంబీ గార్డెన్‌లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంబీ గార్డెన్‌లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రజాపాలన పేరిట పాలన కొనసాగుతుందని, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్లు, గృహ జ్యోతి, 5 వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరా మహిళా శక్తి పేరిట వడ్డీ లేని రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మున్సిపల్ వార్డుల్లో ప్రజలకు ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు. ప్రమాదాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ నివారణ, ఓవర్ స్పీడింగ్ తగ్గించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వంటి ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్‌హవర్‌లోపు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే రహవీర్ పథకం కింద 25 వేల రూపాయల ప్రోత్సాహకం అందిస్తామని, బాధితులకు సమీప ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షన్నర వరకు ఉచిత చికిత్స సౌకర్యం కలిస్తున్నామని తెలిపారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ గజ్జికృష్ణ, సీఐ ప్రవీణ్, అనీల్‌కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.