సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కోవాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:06 AM
సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, అనేక ప్రాంతాల్లో తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సుల్తానాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, అనేక ప్రాంతాల్లో తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతునేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో మాట్లాడి యాసంగి 2026 - 27 పంటల సాగు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. కనుకుల రైతువేదిక నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో పాల్గొన్నారు. జిల్లాలోని రైతు వేదికల నుంచి రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడం, సాగునీటి లభ్యత పరిమితంగా ఉండటంతో రైతులు యాసంగి పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ లభ్యతకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు. రైతుల సంకేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వాస్తవాలను అర్థం చేసుకుని, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితిని ఆధారంగా సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేసి నష్టపోకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కష్టకాలంలో అధికారులకు సహకరించాలని, వారు అందించే సూచనలు, సలహాలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నుంచే రైతులకు అవగాహన కల్పిస్తోందని తెలిపారు. ముందస్తు అవగాహన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిందని, మహబూబ్‌నగర్ ప్రాంతంలో కూరగాయల సాగు పెరిగిందని వివరించారు. యాసంగిలో అధిక నీటి అవసరం ఉన్న వరి సాగుపై రైతులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతులు తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, అందుబాటులో ఉన్న నీటి వివరాల ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి, కరువు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రభావం మరింత బలపడవచ్చని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి ప్రసాద్, డిసిఓ శ్రీమాల, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్, అధికారులు పాల్గొన్నారు.