Share News

సాగుకు నీరు నిలిపివేత

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:58 AM

జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్‌ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ ముగిసింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.518 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు పక్కన బెట్టారు.

 సాగుకు నీరు నిలిపివేత

జగిత్యాల, ఏప్రిల్‌18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్‌ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ ముగిసింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.518 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు పక్కన బెట్టారు. ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళిక ముగిసినప్పటికీ కాకతీయ కాలువ నీటి ఆధారంగా సాగవుతున్న వరి పంటలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోతకు రాలేదు. కనీసం మరో వారం రోజుల పాటు మరో తడి నీరందిస్తే పంటలు చేతికందుతాయని ఆయకట్టు రైతులు అంటున్నారు. చివరికి నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తాగునీటికి ప్రాధాన్యం

ప్రాజెక్టులో ప్రస్తుతం 20.518 టీఎంసీల నీరు నిల్వ ఉండగా అందులో 5 టీఎంసీల డెడ్‌ స్టోరేజీ, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోతుంది. ఆవిరి రూపంలో 2 టీఎంసీల నీరు పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 8 టీఎంసీల నీరు కచ్చితంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో కాకతీయ కాలువ ద్వారా మరో తడి ఇచ్చే అవకాశం లేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. నీటి విడుదల చేయకపోతే పంటలు ఎండిపోవడం ఖాయమని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫగత యేడాది డిసెంబరు 25 నుంచి నీటి విడుదల...

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి గత యేడాది డిసెంబరు 24వ తేదీ నుంచి నీటి విడుదల చేపట్టారు. ఈనెల 18వ తేదీ వరకు వారబందీ పద్ధతిలో నీటిని సరఫరా చేశారు. కాకతీయ కాలువ ద్వారా ఏడు రోజులు జోన్‌-1కు 3,500 క్యూసెక్కులు, ఎనిమిది రోజులు జోన్‌-2కు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లక్ష్మీ కాలువ, సరస్వతీ కాలువ, గుత్ప, అల్లీసాగర్‌ ఎత్తిపోతల పథకాలకు సైతం నీటి కేటాయింపులు జరిపారు. యాసంగి సాగుకు నీరు అందించడానికి అధికారులు 57.68 టీఎంసీలను కేటాయించారు. యాసంగి సీజన్‌కు సంబంధించి నీటి విడుదల ప్రారంభమైన సమయంలో ప్రాజెక్టులో 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి పరిస్థితి ఇలా..

ఎస్సీరెస్పీలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.518 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత యేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 11.440 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా మిషన్‌ భగీరథ, సాగు నీటి కాలువలు, ఇతరములకు కలిపి ప్రాజెక్టు నుంచి 5,837 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఉదయం 11 గంటల నుంచి కాకతీయ మెయిన్‌ కెనాల్‌, సరస్వతీ కెనాల్‌, లక్ష్మీ కెనాల్‌లకు నీటిని వదలడం నిలిపివేశారు. ఇప్పటికే అల్లీసాగర్‌, గుత్పా ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను ఆపివేశారు. కాగా నిజామాబాద్‌, నిర్మల్‌ టీఎస్‌ఐడీసీకి సైతం నీటిని వదలడం లేదు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో నిల్వ ఉన్న నీటిని జూలై వరకు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగీరథ పథకాలకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు 61 క్యూసెక్కులు, ఆదిలాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాలకు 63 క్యూసెక్కులు, ఆర్మూర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి ప్రాంతాలకు 108 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఫజిల్లాలో 3.22 లక్షల ఎకరాల సాగు..

జిల్లాలో యాసంగి సీజన్‌లో 3.22 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వరి పంట 2.43లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేలు ఎకరాలు, పత్తి 15 వేలు, పసుపు 10 వేలు, సోయా బిన్‌ 777 ఎకరాలు, నువ్వులు 13 వేలు ఎకరాలు, పల్లి 300 ఎకరాలు, పెసర 500 ఎకరాలు, మినుము 500 ఎకరాలు, ఆలసంద 500 ఎకరాలు, ఆవాలు 3,000 ఎకరాలు, చెరుకు 900 ఎకరాలు, ఆయిల్‌పామ్‌ 9,000 ఎకరాల్లో సాగు అయినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందుతోంది.

కాలువల ద్వారా సాగు నీరు ఇలా..

జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు సుమారు 91 కిలోమీటర్ల మేర కాకతీయ కాలువ ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు విడుదల చేస్తున్న నీరు 25వ కిలో మీటరు వద్ద జగిత్యాల జిల్లాలో ప్రవహిస్తోంది. 116వ కిలోమీటరు వద్ద ముగుస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు కాకతీయ కాలువకు అనుబంధంగా ఉప కాలువలను నిర్మించి నీరు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో డీ-21 ఉప కాలువ నుంచి డీ 83ఏ వరకు దాదాపుగా 62 డిస్ట్రిబ్యూటర్‌ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీకి ఆయకట్టును బట్టి ఎడమ, కుడి వైపులకు మరో 50 వరకు కాలువలు ఉంటాయి. సంబంధిత మైనర్‌ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు అందిస్తున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ ద్వారా 1.7లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు సమీపంలో ఉండే చెరువులు, కుంటలు నింపేందుకు తూములు ఏర్పాటు చేయడం వల్ల మరో లక్ష ఎకరాలకు ఎస్సారెస్పీ సాగు నీరు అందుతోంది.

కాలువలకు నీటి విడుదల నిలిపివేశాం

-జగదీశ్‌, ఎస్‌ఈ, పోచంపాడ్‌ ప్రాజెక్టు

యాసంగి పంటలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల చేయడాన్ని నిలిపివేశాం. ప్రస్తుతం దాదాపుగా యాసంగి పంటల సాగు పూర్తయింది. కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, సరస్వతీ కాలువలకు నీటి విడుదల ఆపివేశాం. ఇప్పటికే అల్లీసాగర్‌, గుత్పా ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల ఆగిపోయింది.

Updated Date - Apr 19 , 2026 | 12:58 AM