Share News

నెల రోజులుగా నిరీక్షణ

ABN , Publish Date - May 16 , 2026 | 11:41 PM

కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం ధాన్యం పోసినప్పటికీ ఇప్పటికీ తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యం, తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండలంలోని కనగర్తిలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.

 నెల రోజులుగా నిరీక్షణ

ఓదెల, మే 16 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం ధాన్యం పోసినప్పటికీ ఇప్పటికీ తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యం, తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండలంలోని కనగర్తిలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను కేంద్రం నుంచి తరలించడం లేదని, రోజుల తరబడి బస్తాలు ఇక్కడే ఉంటున్నాయని, లారీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో అధికారులు విఫలమయ్యారని, రైతులు ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ తూకం వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ రహదారికి అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇరువైపులా వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎస్‌ఐ రమేష్‌ వారి వద్దకు చేరుకొని రైతులను సముదాయించి అధికారులకు విషయాలను తెలపడంతో ఆందోళన విరమించారు.

Updated Date - May 16 , 2026 | 11:41 PM