Share News

సాగునీటి కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:46 AM

జిల్లాలో వరి పంట చివరి దశకు చేరుకుంటోంది. మరికొద్ది రోజుల్లో పంట చేతికందే పరిస్థితి ఉండటంతో ఈ సమయంలో సాగునీటి అవసరం పెరిగింది. పొట్ట దశ దాటి గింజ గట్టిపడే దశలో ఉన్న వరి పంటకు తగినంత నీరు అందితేనే ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

సాగునీటి కోసం   ఎదురుచూపులు

పెద్దపల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి పంట చివరి దశకు చేరుకుంటోంది. మరికొద్ది రోజుల్లో పంట చేతికందే పరిస్థితి ఉండటంతో ఈ సమయంలో సాగునీటి అవసరం పెరిగింది. పొట్ట దశ దాటి గింజ గట్టిపడే దశలో ఉన్న వరి పంటకు తగినంత నీరు అందితేనే ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కీలక సమయంలో కాలువల ద్వారా సాగునీరు అందకపోతే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాలువల నీటి విడుదలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.

కీలక దశలో పంట..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి సాగు విస్తృతంగా జరుగుతోంది. నెలల తరబడి కష్టపడి పంటను సాగు చేసిన రైతులకు ప్రస్తుతం పంట చేతికందే సమయం దగ్గరపడుతోంది. ఈ దశలో పొలాలకు అవసరమైన నీరు అందకపోతే గింజ నాణ్యత, దిగుబడిపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాలువల నీటిపై ఆధారపడిన రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు కీలకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు, బోరు బావుల ద్వారా నీటి అవసరాన్ని తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ అన్ని పొలాలకు ఆ వెసలుబాటు లేదు. విద్యుత్‌ సరఫరా, బోర్లలో నీటి లభ్యత సమస్యలతో రైతులు కాలువల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. చివరి దశలో పంటను కాపాడు కోవడానికి సకాలంలో నీరు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

రెండు రోజుల్లో ఎస్సారెస్పీ నీరు

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేస్తోంది. పోచంపాడు వద్ద నీటి విడుదల చేపట్టి సోమవారం వరకు ప్రధాన కాలువలకు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్‌ సంబం ధిత మంత్రితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాలువల్లోకి నీరు చేరిన అనంతరం పంపిణీ వ్యవస్థ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం కీలకం కానుంది. ప్రధాన కాలువలకు నీటి విడుదల అనంతరం ఉపకాలువలు ద్వారా చివరి భూముల వరకు నీరు చేరేలా అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది

చివరి ఆయకట్టుపైన దృష్టి పెట్టాలి

ఎస్సారెస్పీ కాలువల నీటిని చివరి ఆయకట్టు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రధాన కాలువల నుంచి నీరు విడుదల చేసినప్పటికీ మధ్యలోని అధికంగా వినియోగిస్తే చివరి భూములకు నీరు చేరడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువల్ల నీటి ప్రవాహాన్ని అధికారులు పర్యవేక్షిస్తూ సమానంగా పంపిణీ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దిగుబడిపై రైతుల ఆశలు

పంట చేతికందే సమయంలో నీటి కొరత ఏర్పడ కుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుత దశలో సకాలంలో సాగునీరు అందితే పంటను కాపాడు కోవడంతో పాటు ఆశించిన దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న నీటి విడుదల ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో ఎంత త్వరగా అమలవుతాయి? చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుందా? అన్నది ఇప్పుడు రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. పంట కోతకు చేరువైన ఈ తరుణంలో ఎస్సారెస్పీ నీటి విడుదల రైతులకు ఊరటనివ్వాలంటే ప్రకటనలకే పరిమితం కాకుండా కాలువల ద్వారా నీరు చేరేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Oct 11 , 2026 | 12:46 AM