ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరీక్షణ..
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:50 PM
ఇంటి స్థలాలు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం తమకు ఎప్పుడు ఇళ్లు మంజూరు చేస్తుందా అని ఇంటి స్థలాలు లేని పేదలు నిరీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో సుమారు 42 వేల మంది ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకు న్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇంటి స్థలాలు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం తమకు ఎప్పుడు ఇళ్లు మంజూరు చేస్తుందా అని ఇంటి స్థలాలు లేని పేదలు నిరీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో సుమారు 42 వేల మంది ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకు న్నారు. రెండో విడత ఏప్రిల్‌లో నియోజకవర్గానికి మరో 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఇం దులో ఇంటి స్థలాలు లేని వారికి ప్రాఽధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబీకుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పేద, నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు మంజూరు చేస్తామని, సొంత ఇంటి స్థలం లేని వారికి స్థలాలు సేకరించి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నది. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష, రూఫ్ లెవెల్ వరకు గోడలు నిర్మాణమైన తర్వాత లక్ష, స్లాబ్ వేసిన తర్వాత లక్షా 40 వేల రూపాయలు. మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి లక్షా 20 వేలు, ఉపాధిహామీ పథకం ద్వారా 40 వేల రూపాయలు చెల్లించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల లోనే గ్రామ, పట్టణ సభలను నిర్వహించి దరఖాస్తులను సేకరిం చింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 1,85,404 దరఖాస్తులు వచ్చాయి. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో 2,707 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మూడు కేటగిరీలుగా విభజన..
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. ఎల్ 1 కేటగిరీలో సొంత ఇంటి స్థలం ఉండి అందులో ఇళ్లు నిర్మించుకునే వాళ్లను చేర్చారు. ఎల్ 2లో ఎలాంటి స్థలం లేని వాళ్లను చేర్చారు. వీరికి ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఎల్ 3 కేటగిరీలో గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై అర్ధాంతరంగా పూర్తి చేసు కున్న లబ్ధిదారులతోపాటు అనర్హులను చేర్చారు. మొదట సొంత ఇంటి స్థలం ఉన్న వారికి, ఆ తర్వాత సొంత స్థలం లేని వారికి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2024-25లో ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిం చింది. అందులో భాగంగా జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు 3,500 ఇళ్ల చొప్పున, మంథని నియోజకవర్గ పరిధిలోని మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి మండలా లకు 1750 ఇళ్లు, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండలానికి 688 ఇళ్లు, మొత్తం 9,438 ఇళ్లు కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు 6,068 ఇళ్లు మంజూరు చేయగా, 4,091 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో బేస్‌మెంట్ లెవెల్‌లో 1165 ఇళ్లు, రూఫ్‌లెవెల్‌లో 622 ఇళ్లు, స్లాబ్ దశలో 2,143 ఇళ్లు, పూర్తి దశలో 161 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మొదటి విడతలో జిల్లాకు కేటా యించిన ప్రకారం ఇంకా 3,370 ఇళ్లు మంజూరు చేయాల్సి ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు 87 కోట్ల 12 లక్షల రూపాయల బిల్లులు చెల్లించారు. వచ్చే నెలలో జిల్లాకు మరిన్ని ఇళ్లు కేటాయించనున్నారు.
ఇంటి స్థలాలు సేకరించి ఇళ్లు మంజూరు చేయాలి..
ఎల్2 కేటగిరీలో ఉన్న దరఖాస్తుదారులు తమకు ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతు న్నారు. మొదటి విడతలో ఇంటి స్థలాలు ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం రెండో విడతలో ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇదివరకు ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. ఆ మేరకు తమకు ఇళ్లు మంజూరు చేయాలంటున్నారు. అయితే ప్రభుత్వం రెండో విడత కేటాయించే ఇళ్లను కూడా ఎల్1లో మిగిలిపోయిన అర్హులకే మంజూరు చేసే అవకాశాలు కనబడుతు న్నాయి. జిల్లాలో ప్రభుత్వ స్థలాల కొరత ఉండడంతోపాటు ప్రైవే ట్‌గా కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం పడనున్నది. ఇళ్ల స్థలాలు ఒక గుంటకు 5 నుంచి 10 లక్షల రూపాయల ధర పలుకుతుండడంతో ఎల్1 కేటగిరీ వాళ్లకే ఇళ్లు మంజూరు చేయడంపైనే దృష్టి సారించారు.
డబుల్ బెడ్ రూముల ఇళ్లు కేటాయించేందుకు కసరత్తు..
గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిర్మించి వదిలి పెట్టిన ఇళ్లను ఎల్2 కేటగిరీలో ఉన్న దరఖాస్తుదారులకు కేటాయించేం దుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో 240 ఇళ్లు, ఓదెలలో 150 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, ప్రభుత్వం వాటిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నది. ఆ పనులు పూర్తి కాగానే ఆ ఇళ్లను ఎల్ 2 కేటగిరీ లబ్ధిదారులకు కేటాయించాలని చూస్తున్నారు. అలాగే గోదావరిఖని జనగాంలో 80 ఇళ్లు, అంతర్గాంలో 60 ఇళ్లు, పుట్నూర్‌లో 10 ఇళ్లు, కాకర్లపల్లిలో 25 ఇళ్లు, కూచ్‌రాజ్‌పల్లిలో 80 ఇళ్లు, సుల్తానాబాద్‌లో 80 ఇళ్లు, బిట్టుపల్లిలో 24 ఇళ్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ ఇళ్లను ఎల్2 కేటగిరీ దరఖాస్తుదారులకు కేటాయించనున్నారు. గత ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షల 4 వేలు కేటాయించగా, నిలిచి పోయిన ఇళ్లకు అప్పుడు ఎంత వరకు బిల్లులు చెల్లించిందో అవి పోనూ మిగతా బిల్లును ప్రస్తుతం ఎల్2 కేటగిరీ దరఖాస్తుదా రులకు ఇవ్వనున్నది. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆ ఇళ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నామని జిల్లా గృహ నిర్మాణ శాఖ మేనేజర్ రాజేశ్వర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుం దన్నారు. వీటి ద్వారా 749 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. అయినా ఇంకా అనేక మంది దరఖాస్తుదారులు నిరీక్షించాల్సి వస్తుంది. ఈ విషయమై తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లాకు రెండో విడతలో కేటాయించే ఇళ్లతో పాటు ఇంటి స్థలాలు తమకు మంజూరు చేయాలని ఎల్2 కేటగిరీ దరఖాస్తుదారులు కోరుతున్నారు.