ఓటర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:31 AM
జిల్లాలో నిర్వహిస్తున్న సర్ విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఽఅధికారులను అదేశించారు. పట్టణంలోని శ్రీవాణి కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.
సుల్తానాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహిస్తున్న సర్ విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఽఅధికారులను అదేశించారు. పట్టణంలోని శ్రీవాణి కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, సమర్పించిన ప్రతీ పత్రాన్ని పరిశీలించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటర్లకు అవసరమైన సమాచారం అందించి, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో పూర్తి కచ్చితత్వంతో నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, తహసీల్దార్ బషీరొద్దిన్, డిప్యూటీ ఈఈ బాబురెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.