ప్రభుత్వ విప్‌గా విజయరమణారావు
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:56 PM
రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు నియమితులయ్యారు. ఉగాది కానుకగా విజయరమణారావుకు ప్రభుత్వ విప్ పదవి దక్కడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుం టున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు నియమితులయ్యారు. ఉగాది కానుకగా విజయరమణారావుకు ప్రభుత్వ విప్ పదవి దక్కడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుం టున్నారు. విజయరమణారావుకు విప్ పదవి వరించడం పెద్దపల్లి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇక్కడి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు ఎవరికి మంత్రి పదవులు, విప్ పదవులు, కార్పొరేషన్ పదవులు దక్కిన దాఖలాలు లేవు. మంథనికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ హయాంలో ప్రభుత్వ విప్‌గా, ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో ఏర్పడ్డ రామగుండం నియోజక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడే కేసీఆర్ హయాంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా వ్యవహరిం చారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒకసారి ప్రభుత్వ విప్‌గా, ఒకసారి మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్లూరి లక్ష్మన్ కుమార్‌ను మొదట ప్రభుత్వ విప్‌గా నియమించగా, మలివిడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కింది. పెద్దపల్లి నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలిపి పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి.
ఈ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చింతకుంట విజయరమణారావు పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందగా, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన 55,108 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్‌లుగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను నియమించారు. అడ్లూరికి మంత్రి పదవి దక్కగా, రాంచంద్రునాయక్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడంతో రెండు విప్ పదవులు ఖాళీ అయ్యాయి. విజయరమణారావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితుల్లో ఒకరు కావడం, నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యేకు మించి ఎవరికి పదవులు దక్కక పోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం విప్‌గా విజయరమణారావును నియమించింది.
ఈ ఘనత నియోజకవర్గ ప్రజలదే..
- చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్ పదవి రావడంలో నియోజకవర్గ ప్రజలదే ఈ ఘనత. రెండు దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న ప్రజలు ఒకసారి జడ్పీటీసీగా, 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారు. నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఏ పదవి దక్కలేదని గుర్తించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందుకు కృషి చేసిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.