స్కానింగ్ సెంటర్ల నిలువు దోపిడీ..
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:50 AM
జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్వాహకులు రిఫరల్ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హత లేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
జగిత్యాల, ఆగస్టు22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్వాహకులు రిఫరల్ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హత లేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని జగిత్యాలతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ తదితర ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది.
ఫకన్నెత్తి చూడని అధికారులు...
గర్భిణులతో పాటు ఎవరిరైనా పొట్టకు సంబంధించి అనారోగ్య సమస్యలు తలెత్తితే స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. వీటితో పాటు చెస్ట్, గ్యాస్టో, లివర్ తదితర సమస్యలు తెలుసుకునేందుకూ సంబంధిత వైద్యులు స్కానింగ్‌కు రెఫర్ చేస్తుంటారు. అందులో వచ్చే రిపోర్టు ఆధారంగానే వైద్యులు చికిత్స చేస్తారు. గాయాలు, తలనొప్పి, చెస్ట్, నరాల సమస్య ఎదుర్కొనే రోగులకు ఆర్థో, ఇతర వైద్యులు ఎక్కువగా ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌కు రాస్తుంటారు. అయితే కొందరు వైద్యులు అవసరం లేకున్నా స్కానింగ్ సెంటర్లకు పలు పరీక్షల కోసం రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు.
ఫఅధికంగా ఫీజు వసూళ్లు...
ఎక్స్‌రే కోసం రూ.500 నుంచి రూ.1200 వరకు, స్కానింగ్‌కు రూ.800 నుంచి రూ.2000 వరకు రోగుల నుంచి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇక సీటీస్కాన్, ఎమ్‌ఆర్‌ఐల విషయానికొస్తే ఫీజులు వేలల్లో ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 80 వరకు అలా్ట్ర సౌండ్ స్కానింగ్ సెంటర్లు, పదుల సంఖ్యలో ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎమ్‌ఆర్‌ఐలు ఉన్నాయి. పలు సెంటర్లలో ధరల నియంత్రణ పాటించడం లేదు. పేరుకు మాత్రమే ధరల పట్టిక ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వసూలు చేస్తూన్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేయాల్సిన వైద్యారోగ్య శాఖ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఫఅంతా రెఫరల్ ...
జిల్లాలో పలువురు సీనియర్ వైద్యులు సొంతంగా ఆసుపత్రులు నడుపుతూ అవసరం ఉంటేనే ఎక్స్‌రే, స్కానింగ్, సీటీస్కాన్, ఎమ్‌ఆర్‌ఐ చేయించుకోవాలని రోగులకు సలహా ఇస్తున్నారు. కానీ కొన్ని మేనేజ్‌మెంట్ ఆసుపత్రుల్లోని వైద్యులు మాత్రం ప్రతి చిన్న సమస్యకు ఎక్స్‌రే, సిటీస్కాన్, స్కానింగ్, ఎమ్‌ఆర్‌ఐలు రాస్తున్నారు. ఇలా రిఫరల్ దందా చేస్తూ కొంతమంది వైద్యులు కమీషన్లు తీసుకుంటున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పరీక్షలకు సంబంధించి రూ.1000 ఫీజుకు రూ. 300 చొప్పున కమీషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఫజూనియర్లతోనే నిర్వహణ..
ఎక్స్‌రే, స్కానింగ్, సీటీస్కాన్, ఎమ్‌ఆర్‌ఐ ఏది తీయాలన్నా అనుభవం, అర్హత ఉన్న టెక్నీషియన్ ఉండాలి. డీఎమ్‌ఐటీ (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ) కోర్సు చేసి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మల్టీ, సూపర్ స్పెషాలిటీ, పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో టెక్నీషియన్లకు రూ.35 వేల నుంచి 50 వేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సెంటర్లలో జూనియర్లకు రూ.20 వేల లోపు జీతాలు ఇచ్చి నిబంధ నలకు విరుద్ధంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్లు ఇచ్చే స్కానింగ్ రిపోర్టులో తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
-డాక్టర్ సుజాత, డీఎంహెచ్‌వో
జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లలో ఇప్పటికే తనిఖీలు చేశాం. స్కానింగ్ విషయంలో తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు మా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని ఎక్స్‌రే, స్కానింగ్, సిటీ స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ తదితర సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తప్పవు. బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.