Share News

భక్తజనసంద్రంగా వేములవాడ

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:07 AM

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హరిహరక్షేత్రంగా పిలువబడుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరాలయం ఓం నమః శివాయ నామస్మరణతో మర్మోగింది. భీమేశ్వఆరలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. దాదాపు ఒక లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

భక్తజనసంద్రంగా వేములవాడ

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హరిహరక్షేత్రంగా పిలువబడుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరాలయం ఓం నమః శివాయ నామస్మరణతో మర్మోగింది. భీమేశ్వఆరలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. దాదాపు ఒక లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు, గుడిచెరువు, జాత్రగ్రౌండ్‌, తదితర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలో నిర్వహించిన మహాశివరాత్రిజాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పట్టణంలోని ఆలయపరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుకాణ సముదాయాలు భక్తుల కొనుగోళ్లతో సందడిగా మారింది. జాతరకు వచ్చిన భక్తులు పట్టణవీధుల్లో కలియతిరుగుతూ ఆధ్యాత్మికతతో మునిగి తేలారు. పట్టణంలోకి ఎలాంటి వాహనాలను అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా భీమేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులకు పలు స్వచ్ఛందసంస్థలు సేవలు అందించాయి. వాసవి సేవసమితి ఆధ్వర్యంలో లక్ష్మిగణపతి కాంప్లెక్స్‌లోఉచితంగా భక్తులకు అన్నదానం చేశారు. ఆర్యవైశ్యసంఘం, పలు కంపెనీల ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు, అరటిపండ్లు అందించారు.

వైభవంగా మహాలింగార్చన పూజ

మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఆదివారం సాయంత్రం రెండు గంటల పాటు మహాలింగార్చన పూజను ఆలయ వేదపండితులు, అనువంశికఅర్చకులు వైభవంగా నిర్వహించారు. రాత్రి 11.45గంటలకు 11మంది రుత్వికులతో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కనులపండువగా నిర్వహించారు.

ఆకట్టుకున్న శివస్వాములు ర్యాలీ

శివదీక్షాపరుల మాలవిరమణ సందర్భంగా వేములవాడ పట్టణంలో శివస్వాములు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ సందర్భంగా పట్టణ పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివనామస్మరణలు, భక్తిగీతాలపనలతో విధులన్నీ మార్మొగాయి. ఈ సందర్భంగా పలువురు శివస్వాములు శివుడి వేషాధారణలో ఆకట్టుకున్నారు. చేతిలో త్రిశూలం, డమరుకంతో నృత్యాలు చేశారు. గర్బగుడిలో స్వామివారిని స్పర్శదర్శనం చేసుకొని దీక్ష విరమించారు. శివస్వాములు ఆలయానికి చేరుకోవడంతో సాధారణ భక్తుల దర్శనాలు నిలిపివేశారు.

అనుబంధ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ

మహాశివరాత్రి సందర్భంగా భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన నగరేవ్వర, కేదారేశ్వరాలయల్లో భక్తుల రద్దీ నెలకొంది. భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనుబంధ ఆలయాల్లోనూ భక్తులు స్వామివారికి అభిషేకం చేశారు.

కోలాహలంగా వేములవాడ వీధులు

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణం జనసంద్రంగా మారింది. పట్టణానికి పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులుతరలివచ్చారు. కోరుట్ల, తిప్పాపూర్‌ బస్టాండ్‌నుంచి ప్రధాన దారుల్లో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో పట్టణ వీధులన్నీ కోలాహాలంగా మారాయి. జాత్రాగ్రౌండ్‌, గుడిచెరువు, ప్రాంతాల్లో భక్తులు పోటెత్తారు. జాతర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల పుటేజిలను కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పోలీసులు 24గంటలు పర్యవేక్షించారు.

భక్తిశ్రద్ధలతో జాగారాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ భీమేశ్వరాలయం పరిసరాల్లో భక్తులు జాగారాలు ప్రారంభించారు. శివరాత్రి రోజున నిష్టతో ఉపవాస దీక్షచేస్తే పుణ్యఫలం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. శివుని చెంత దూపదీపాలు, నైవేధ్యాలతో జాగారాలు చేయడం ఆనవాయితీ. పరమేశ్వరుడి అత్యంత ప్రీతికరమైన ఉపవాస జాగారాలనుభక్తులు భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆలయ ఆవరణలోని గుడిచెరువులో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వేదికముందు భక్తులు జాగారాలు చేశారు. షవర్స్‌లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోగుపూలు, కందగడ్డలతో వారు బసచేసినచెఓటనే జ్యోతులు వెలిగించుకొని జాగారాలు చేశారు.

ఆకట్టుకున్న శివార్చన

భక్తులకు ఆధ్యాత్మిక భావాన్ని కలిగించేందుకు ఆలయ పార్కింగ్‌ స్థలంలో ప్రత్యేక వేదికపై ఏర్పాటుచేసిన శివార్చన ఆకట్టుకుంది. కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్క్రతిక కార్యక్రమాలు ఆకర్శించాయి. భక్తిగీతాలు, జానపదపాటలు, కూచిపూడి , భరత నాట్యం, శివతాండవం, వివిధ నాటకాలు ప్రదర్శించి భక్తులను అలరింపజేశారు.

భీమన్న సన్నిధిలో ప్రముఖల పూజలు

భీమేశ్వరాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, ఎస్పీ మహేష్‌ బి. గీతే తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం

మహాశివరాత్రిని పురస్కరించుకొని భీమేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక ర్యాంప్‌ నిర్మించి 60వీల్‌చైర్‌ల ద్వారా దర్శనం చేయించారు. ఎన్నడూలేని విధంగా ఈ సౌకర్యం అందరిని ఆకట్టుకుంది.

48గంటల పాటు ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎస్పీల పర్యవేక్షణ

మహాశివరాత్రి జాతర సందర్బంగా వేములవాడలో 48గంటల పాలు నిరంతరంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి. గీతేలు పర్యవేక్షించారు. ఆలయ ప్రాంతాలన్ని కలియ తిరిగి ఏర్పాట్లు చూశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు , ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా భీమేశ్వర సదన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా సీసీ పుటీజీలు పరిశీలించి అధికారులకు అప్పటికప్పుడే సూచనలు ఇచ్చారు. ఈ జాతరలో ఇంచార్జి కలెక్టర్‌ను అందరూ అభినందించారు.

బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఇన్‌చార్జి కలెక్టర్‌

మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా వేములవాడలోని బద్దిపోచమ్మ అమ్మవారిని జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఇంచార్జి కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అడ్డూ ప్రసాదం కౌంటర్లను పరిశీలించారు.

Updated Date - Feb 16 , 2026 | 01:07 AM