Share News

మొఖం చాటేసిన వరుణుడు

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:30 PM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల్లో వానలు కురవకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి రైతులు ఎక్కువగా వరి సాగును చేపట్టారు.

మొఖం చాటేసిన వరుణుడు

సుల్తానాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల్లో వానలు కురవకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి రైతులు ఎక్కువగా వరి సాగును చేపట్టారు. వ్యవసాయ అధికారులు ఎల్‌నినో ప్రభావంపై విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆరు సన్న రకాల విత్తనాలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. అయితే రైతులు మాత్రం పాత పద్ధతిలోనే సాగు ఎంపిక చేసుకున్నారు. కొంత ఆలస్యంగా అడపాదడపా వర్షాలు పడడంతో వరి సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో రైతులు వరి సాగు చేయగా అనంతరం వర్షాలు మొఖం చాటేశాయి. మండలంలోని 27 గ్రామాల్లో 24వేల39 ఎకరాలలో వరి, మరో రెండు వేల ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇతర పంటలతో కలసి 26 వేల 61 ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. సొంత వ్యవసాయ భావులు కలిగి ఉన్న వారు ఎక్కువగా వరి పంట వేశారు. కొందరు కాలువ నీరు ఆధారంగా, మరి కొందరు రైతులు కేవలం వర్షాల ఆధారంగా వరి పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంటలు అంతటా బాగానే ఉన్నా వారం రోజుల్లో వర్షాలు కురవక పోతే పంటల పరిస్థితి ఏమవుతుందోనని అందోళన నెలకొంది. నారు పచ్చగా ఉన్నా నీరు లేక బీటలు వారే దుస్థితి నెలకొంది.

ఎండిపోతున్న పంట పొలాలు

గెల్లు శ్రీనివాస్‌, యాదవనగర్‌ సుల్తానాబాద్‌

తాను మూడు ఎకరాలలో వరి పంట సాగు చేశాను. ఎస్సారెస్పీ ఉప కాలువ పక్కన పొలం ఉంది. వర్షం అధారంగా మాత్రమే సాగు చేస్తున్నా. నాట్లు పూర్తయ్యే వరకు వర్షాలు అనుకూలంగా ఉంది. నెల రోజుల నుంచి వానలు కురవకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. మడులు బీటలు బారుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో వానలు కురవకపోతే వరి పంట నష్టం పోవాల్సివస్తుంది.

రైతులను ముందుగానే హెచ్చరించాం

- మండల వ్యవసాయాధికారి పైడితల్లి

సీజన్‌కు సంబంధించి రైతులను ముందుగానే హెచ్చరించాం. వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పాం. రైతువేదికలలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం. రైతులు వరి పంటలు మాత్రమే వేసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సాగు నీరు లభ్యతను ఆధారంగా రైతులు వరి వేసుకున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 11:30 PM