తేలని రిజర్వేషన్లు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:52 AM
మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలోనే జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్లు ఇంకా ఖరారుకాక పోవడంతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కరీంనగర్ టౌన్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలోనే జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్లు ఇంకా ఖరారుకాక పోవడంతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన 15 రోజుల్లోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. మున్సి‘పోల్స్’ కూడా 15 రోజుల్లోనే జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రిజర్వేషన్లను ఖరారు చేసి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తే స్వల్ప వ్యవధిలో డివిజన్లలోని ఓటర్లందరిని కలుసుకునే అవకాశముంటుందో లేదోనని ఆశావహులు భయపడుతున్నారు.
అనుకూలిస్తుందా.. లేదా..
రిజర్వేషన్లలో పోటీ చేసేందుకు అవకాశం వస్తుందో లేదో తెలియక మరోవైపు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రిజర్వేషన్లపై ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో గతంలో 60 డివిజన్లు ఉండగా ఇటీవల కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు చింతకుంట, లక్ష్మిపూర్, మల్కాపూర్, గోపాల్‌పూర్, దుర్శేడ్, బొమ్మకల్ గ్రామాలను విలీనం చేయడంతో డివిజన్ల సంఖ్య 66కు చేరుకుంది. దీంతో డివిజన్ల నైసర్గిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. డివిజన్ల పునర్విభజన, సంఖ్య పెరుగడంతో రిజర్వేషన్లు చాలా మేరకు మారిపోయే అవకాశాలుంటాయి. దీంతో ఏ డివిజన్ జనరల్ అవుతుందో... ఏ డివిజన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అవుతాయో తెలియడం లేదు.
అంతా అయోమయం
ఈనెల 10వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన తర్వాత, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిజర్వేషన్లను ప్రకటించే అవకాశాలుంటాయి. గతంలో 60 డివిజన్లు ఉండగా ఒకటి ఎస్టీ, ఆరు ఎస్సీ కేటగిరిలకు రిజర్వు కాగా, 23 డివిజన్లు బీసీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 30 డివిజన్లు జనరల్‌కు కేటాయించారు. ఈసారి కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు మరో ఆరు గ్రామాలను విలీనం చేయడంతో రిజర్వుడ్ స్థానాల సంఖ్య ఎన్ని పెరుగుతాయో, ఏయే డివిజన్లు రిజర్వుడ్ అవుతాయో తెలియక నాయకులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన..
స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ ప్రాతిపదికన డివిజన్లను రిజర్వు చేస్తారో, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రాతిపదికన మేయర్, చైర్మన్ల రిజర్వేషన్లు ఏ విధంగా చేస్తారోనన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ ఇచ్చే నిబంధనల మేరకు డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. కరీంనగర్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు 66కు పెరుగడంతో ఒకటి ఎస్సీ, ఒకటి బీసీ లేదా రెండు డివిజన్లు బీసీ రిజర్వేషన్లు కావచ్చని అంచనా వేస్తున్నారు. జనరల్ డివిజన్లు 30 నుంచి 34 వరకు పెరిగే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఈనెల 10న తుది ఓటరు జాబితా విడుదల చేసిన తర్వాత ఏ ప్రాతిపదికన డివిజన్లు రిజర్వ్ చేస్తారనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై ఆధారపడి ఉంది. ఈనెల 12 లేదా 13న రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత షెడ్యూల్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 5నలేదా ఒకటి రెండు రోజులు అటు, ఇటు ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది.
జోరుగా ఫ్లెక్సీల ఏర్పాటు
డివిజన్లలో కార్పొరేటర్లుగా, వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ముందస్తు ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నారు. కరీంనగర్‌లోని 66 డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా వారివారి డివిజన్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, పోటీలో ఉంటున్నానని, మీ ఆశీర్వాదం ఉండాలంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. కొందరు రిజర్వేషన్లు అనుకూలంగా రానట్లయితే పక్క డివిజన్లలో పోటీచేయాలా లేక పోటీ నుంచి విరమించుకోవడమా అనే సందిగ్ధంలో ఉన్నారు. మరికొందరు రిజర్వేషన్ అనుకూలంగా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకొందరు డివిజన్లలోని ఓటర్ల ఆధారంగా తమ డివిజన్ బీసీ అవుతుందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వు అవుతుందని అంచనా వేసుకొని, జనరల్ అయినా పోటీ చేయవచ్చనే ఆలోచనతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.