సుల్తానాబాద్‌పై వీడని ఉత్కంఠ
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:17 AM
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పేచీ వీడడం లేదు. చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో కొద్ది రోజులుగా చర్చలు, సమీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఎటూ తేలకపోవడంతో జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక్క అభ్యర్థి తనను చైర్మన్ చేస్తే మిగతా సభ్యులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పేచీ వీడడం లేదు. చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో కొద్ది రోజులుగా చర్చలు, సమీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఎటూ తేలకపోవడంతో జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక్క అభ్యర్థి తనను చైర్మన్ చేస్తే మిగతా సభ్యులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 25 నుంచి 30 లక్షల వరకు నగదు ఒక్కొక్కరికి కారు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. మరి కొందరు చైర్మన్ పదవి విషయంలో సఖ్యత వచ్చిందని ఆ పదవి కోసం పోటీ పడుతున్న వారిద్దరిలో చెరి రెండున్నరేళ్లు పదవుల్లో కొనసాగేందుకు ఒప్పందం కుదిరినట్లు చెప్పుకుంటున్నారు. చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఇద్దరు నేతలు తమ పట్టు వీడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని పాచికలు ప్రయోగిస్తున్నారు. ఎమ్మెల్యేదే తుది నిర్ణయంగా ఉంది. ఎమ్మెల్యే పేర్కొంటున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రాధాకృష్ణకు చైర్మన్ పదవిని కట్టబెడతారని సమాచారం. అలాగే వైస్ చైర్మన్ పదవికి కూడా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల పేర్లు పరిశీలిస్తున్నారు. 13వ వార్డు కౌన్సిలర్ సిద్ద తిరుపతి, 14 వార్డు కౌన్సిలర్ వేగోలం పద్మ, 7వ వార్డు నుంచి ఎస్సీ అభ్యర్థిగా గెలుపొందిన ఊట్ల వరప్రదీప్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చైర్మన్ ఎన్నికపై వస్తున్న పుకార్లను పలువురు నేతలు కొట్టి పారేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రమాణ స్వీకారాలు, చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు జరిగాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీ మాత్రమే ఏకాభిప్రాయం రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. సుల్తానాబాద్‌కు చెందిన 12 మంది కాంగ్రెస్ సభ్యులు, ఒక ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థితో సహా క్యాంపులో ఉన్నారు. సోమవారం వారు బయలుదేరి రాత్రి వరకు రానున్నారు. వారు నేరుగా ఉదయం ప్రమాణ స్వీకారం కోసం కార్యాలయం వద్దకే వస్తున్నట్లు సమాచారం. చైర్మన్, వైస్‌చైర్మన్ పేర్లను సీల్డ్ కవర్‌లో ఇవ్వనున్నట్లు తెలిసింది.