రామగిరి ఖిల్లాపై ట్రెక్కింగ్
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:09 PM
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు పడుతోంది. ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ’మన జిల్లా - మన రామగిరి ఖిల్లా‘ పేరుతో ఈనెల 18న వాకింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పెద్దపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు పడుతోంది. ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ’మన జిల్లా - మన రామగిరి ఖిల్లా‘ పేరుతో ఈనెల 18న వాకింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రకృతి పర్యాటకానికి ఉన్న అవకాశాలను వెలుగులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ప్రకృతి అందాలు.. చరిత్ర ఆనవాళ్లు!
పచ్చని చెట్లు, కొండలు, రాళ్లతో కూడిన ప్రకృతి దృశ్యాల మధ్య విస్తరించిన రామగిరి ఖిల్లా ప్రాంతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రత్యేకతను కలిగి ఉంది. కొండ మార్గాల్లో నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం, చారిత్రక కట్టడాలు, ఆనవాళ్లను పరిశీలించడం సందర్శకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చారిత్రక ప్రదేశాల సందర్శనను కేవలం విహారయాత్రకే పరిమితం చేయకుండా, వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తే యువతలో వారసత్వ సంపదపై అవగాహన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈనెల 18న ఆదివారం ఉదయం 6 గంటలకు బేగంపేట నుంచి ట్రెక్కింగ్ ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ట్రెక్కింగ్‌లో పాల్గొనాలనుకునే ఆసక్తిగల వారు పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
పర్యావరణ పరిరక్షణే ప్రాధాన్యం
ట్రెక్కింగ్ సమయంలో చెట్లు, మొక్కలు, వృక్షసంపదకు నష్టం కలిగించకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయకుండా ప్రకృతిని పరిరక్షించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. చారిత్రక ప్రదేశాల గోడలు, కట్టడాలపై రాతలు రాయకుండా, అక్కడి ఆనవాళ్లను ధ్వంసం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రామగిరి ఖిల్లా ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని పర్యాటక, వారసత్వ పరిరక్షణ కార్యక్రమాలకు దారితీస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే చరిత్రను తెలుసుకోవడం, వారసత్వ సంపదను కాపాడుకోవడం అనే సందేశంతో ట్రెక్కింగ్‌లో భాగస్వాములు కావాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది. ఈ కార్యక్రమం జిల్లా పర్యాటకానికి కొత్త గుర్తింపు తీసుకురావడానికి దోహదపడుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.