పల్లె సారథులకు శిక్షణ షురూ
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:39 AM
పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జిల్లాలో పది మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు.
జగిత్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జిల్లాలో పది మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ఈనెల 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చేలా షెడ్యూల్ రూపొందించి అందుకు అనుగుణంగా సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ సెంటర్‌లో సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 385 మంది సర్పంచ్‌లు, 3,536 మంది వార్డు సభ్యులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది సర్పంచ్‌లు నూతనంగా ఎన్నికయిన వారే ఉన్నారు. దీంతో చాలా మంది పాలనా పరమైన అనుభవం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌లకు విధులు, బాధ్యతలు, నిధులు సమకూర్చడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ విడతలో రెండు బ్యాచ్‌లు..ఒక్కో బ్యాచ్‌కు 50 మంది చొప్పున శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు ఐదు రోజుల శిక్షణ ఉంటుంది.
మూడు విడతలుగా శిక్షణ
జిల్లాలో మూడు విడుతలుగా సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తున్నారు. మొదటి విడత ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాలకు చెందిన 122 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తున్నారు. రెండో విడత ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జగిత్యాల, జగిత్యాల రూరల్, సారంగాపూర్, బీర్‌పూర్, రాయికల్, గొల్లపల్లి మండలాలకు చెందిన 128 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడత ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మల్యాల, ధర్మపురి, వెల్గటూరు, బుగ్గారం, ఎండపల్లి, కొడిమ్యాల మండలాల్లోని 135 మంది సర్పంచ్‌లకు శిక్షణ నిర్వహించనున్నారు.
24 అంశాలపై అవగాహన
గ్రామ పాలనలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వన మహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ-అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక ఇలా 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని అంశాలపై పట్టు సాధించి గ్రామాభివృద్ధికి కృషి చేసే విధంగా ప్రోత్సహించనున్నారు. పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేయకుండా పల్లె అభివృద్ధికి కృషి చేసేలా సర్పంచ్‌లకు వివరించనున్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
-మదన్‌మోహన్, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలోని సర్పంచ్‌లు, వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు శిక్షణ జరుగుతుంది. జిల్లాలో పది మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేశాము. సర్పంచ్‌లకు న్యాక్ సెంటర్‌లో, వార్డు సభ్యులకు ఆయా మండల కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నాం.