Share News

ట్రాఫిక్‌ చక్రవ్యూహం

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:10 AM

పెద్దపల్లి పట్టణం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలా మారింది. పట్టణం ప్రారంభం రంగంపల్లి నుంచి మంథని ఫ్లైవోవర్‌ వరకు ప్రయాణించడం గగనంగా మారింది. పలు యూటర్న్‌లు, సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ రాజీవ్‌ రహదారి పట్టణం నుంచే ఉండడంతో గందరగోళంగా తయారైంది

ట్రాఫిక్‌ చక్రవ్యూహం

పెద్దపల్లి టౌన్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలా మారింది. పట్టణం ప్రారంభం రంగంపల్లి నుంచి మంథని ఫ్లైవోవర్‌ వరకు ప్రయాణించడం గగనంగా మారింది. పలు యూటర్న్‌లు, సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ రాజీవ్‌ రహదారి పట్టణం నుంచే ఉండడంతో గందరగోళంగా తయారైంది. బైపాస్‌ లేకపోవడంతో ప్రధాన సమస్యగా మారింది. పెద్దపల్లి పట్టణంలో నిత్యం పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ప్రమాద స్థలంలోనే మృత్యువాత పడుతుండగా మరి కొందరు క్షతగాత్రులవుతున్నారు.

జిల్లా కేంద్రంలో రంగంపల్లి నుంచి మంథని ఫ్లైవోవర్‌ బ్రిడ్జి వరకు ఏదో ఒక చోట నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక శాతం యూటర్న్‌లు, సిగ్నల్స్‌ వద్దే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ ట్రాఫిక్‌ పోలీసుల పట్టింపు లేకుండాపోయింది. సిగ్నల్స్‌, ప్రధానకూడళ్ళ వద్ద ఉంటున్న ట్రాఫిక్‌ పోలీసులు కేవలం సెల్‌ఫోన్లకే పరిమతమవుతున్నారు. ట్రాఫిక్‌ను గాలికి వదిలేసి ఛాలన్ల వసూల్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసుల ముందే ట్రిపుల్‌ రైడింగ్‌, సిగ్నల్‌ జంప్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ వెళ్తున్నారు. పట్టణంలో బస్టాండ్‌, అయ్యప్ప టెంపుల్‌, కమాన్‌రోడ్‌, కునారం రోడ్డు వద్ద సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పని చేయనప్పుడు వాహనదారులు అడ్డదిడ్డంగా వెళుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే అయ్యప్ప టెంపుల్‌ చౌరస్తాలో పాఠశాలలు, కాలేజీల విద్యార్థులతో బిజీబిజీగా ఉంటుంది. పోలీస్‌ల నియంత్రణ లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వాహనదారులు వ్యవహరిస్తున్నారు. వాహనాల తనిఖీలు చేపట్టినప్పుడు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన సంఘటనలు ఉన్నాయి. రాజీవ్‌ రహదారి రంగంపల్లి నుంచి మంథని ఫ్లైవోవర్‌ బ్రిడ్జి వరకు ప్రమాదాలు జరిగి వారానికి ఇద్దరు ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. ఫ్లైవోవర్‌ వద్ద శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరిగితే కొంత ప్రమాదాలు తగ్గుతాయి. ట్రాఫిక్‌ నిబంధనలపై అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికి వాహనాదారుల్లో మార్పు రాకపోవడంతో పోలీసులు ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు.

వారం రోజుల్లో ముగ్గురు మృత్యువాత

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రమాదాల్లో వారం రోజుల్లో ముగ్గురు మృతిచెందారు. అయ్యప్ప టెంపుల్‌ చౌరస్తాలో లారీ ఢీకొన్న ప్రమాదాల్లో కొంతెంవాడకు చెందిన వరాల కొమురయ్య, చీకురాయి రోడ్డుకు చెందిన కుక్క ధనలక్ష్మీ స్టాఫ్‌నర్స్‌, రంగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలసాలకు చెందిన కారోబార్‌ మృతి చెందాడు.

పెద్దపల్లి జిల్లా పరిధిలో రెండు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు

పెద్దపల్లి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి దుబ్బపల్లి నుంచి బసంత్‌నగర్‌ బుగ్గ ప్రాంతం, పెద్దపల్లి నుంచి పాలితం, సబ్బితం వరకు విస్తరించి ఉంది. పెద్దపల్లి పరిధిలో సీఐ, ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్ళు, 25 మంది కానిస్టేబుళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. సరిపడా సిబ్బంది ఉన్నప్పటికి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ను నియంత్రించ లేకపోతున్నారు. ఛాలన్ల వసూల్‌కు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మిగితా సిబ్బందిని ట్రాఫిక్‌ విధులకు కేటాయిస్తే కొంత మెరుగుపడే అవకాశాలున్నాయి. పెద్దపల్లికి బైపాస్‌ రోడ్డు లేకపోవడమే ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. బైపాస్‌ పనులు పూర్తయితే ట్రాఫిక్‌ నియంత్రణ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోందని వాహనాదారులు పేర్కొంటున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:10 AM