నేడు సద్దుల బతుకమ్మ
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:17 AM
సద్దుల బతుకమ్మ పండగను జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చేందుకు ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. పండుగ సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు ఆయా డివిజన్లలో, గ్రామాలలో, మండల కేంద్రాలలో వివిధ పార్టీల నాయకులు, కార్పోరేటర్లు, అధికారుల ఆధ్వర్యంలో పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్ కల్చరల్ అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ పండగను జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చేందుకు ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. పండుగ సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు ఆయా డివిజన్లలో, గ్రామాలలో, మండల కేంద్రాలలో వివిధ పార్టీల నాయకులు, కార్పోరేటర్లు, అధికారుల ఆధ్వర్యంలో పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ప్రారంభమయ్యే బతుకమ్మ ఆటలు రాత్రి వరకు కొనసాగనుండగా బతుకమ్మలు సమీప జలాశయాలకు నిమజ్జనానికి తరలనున్నాయి.
మార్కెట్లో సందడి
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రెండు రోజుల నుంచి నగరం పూల కొనుగోళ్లతో కిటకిటలాడుతోంది. ప్రజలు వివిధ రకాల పూలను కొనుగోలు చేస్తుండటంతో రహదారులన్నీ జనంతో కిక్కిరిసి పోతున్నాయి. శనివారం ధరలు చుక్కలను చూపగా పూల పండుగ కావడంతో విధి లేక కొనుగోలు చేసిన జనం బెంబేలెత్తిపోయారు. గ్రామాల నుంచి రకరకాల పూలను తెచ్చి అమ్మగా జనం ఎగబడి కొన్నారు. అరుదైన పూలపై ఆసక్తి కనబరిచారు. మామూలు రోజుల కంటే పూలకు గిరాకీ పెరిగింది. రాత్రి పొద్దు పోయే వరకు వ్యాపారం బాగా సాగుతోందని వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టవర్, అమరవీరుల స్తూపం, మార్కెట్ రోడ్, శనివారం అంగడి ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. శివారు ప్రాంతాల్లో సైతం అమ్మకాలు కొనసాగించారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకమ్మలో కీలక భూమిక పోషించే తంగెడు, గునుగు పూలు ఐదు చిన్న కట్టలను 100 రూపాయలకు పైగా అమ్మారు. పట్టుకుచ్చులు పెద్ద కట్ట 80 నుంచి 90 వరకు, పోకబంతులు 100 రూపాయలకు 6 నుంచి 7 వరకు కట్టలు విక్రయించారు. చేమంతులు 50 గ్రాములకు 80 రూపాయల వరకు పలికాయి. కట్లపూలు, పట్నం బంతులు, మల్లెలు, గోరంట, తదితర పూలు 50 నుంచి 70 రూపాయలకు కుప్ప చొప్పున అమ్మగా గుమ్మడి పూలు 10 రూపాయలకు ఒకటి చొప్పున ఇచ్చారు. తామర, గుమ్మడి ఆకులకు గిరాకీ పెరిగింది. గుమ్మడి కాయలు 80 నుంచి 150 వరకు విక్రయించారు.