Share News

కరువు గండం ఎదుర్కొనేలా..

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:13 AM

సూపర్‌ ఎల్‌నినో ‘కరువు’ గండం ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారుల ముంగిట సూపర్‌ ఎల్‌నినో సవాల్‌గా నిలిచింది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌నినో విపత్తులాంటి పరిస్థితుల్లో వచ్చే జలగండాన్ని ఎదుర్కొనే దిశగా వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ - గ్రామీణ(వీబీ-జీరామ్‌జీ) ద్వారా జలసిరి కార్యక్రమంలో నీటి సంరక్షణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

కరువు గండం ఎదుర్కొనేలా..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సూపర్‌ ఎల్‌నినో ‘కరువు’ గండం ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారుల ముంగిట సూపర్‌ ఎల్‌నినో సవాల్‌గా నిలిచింది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌నినో విపత్తులాంటి పరిస్థితుల్లో వచ్చే జలగండాన్ని ఎదుర్కొనే దిశగా వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ - గ్రామీణ(వీబీ-జీరామ్‌జీ) ద్వారా జలసిరి కార్యక్రమంలో నీటి సంరక్షణ పనులు వేగంగా జరుగుతున్నాయి. జలసిరి పనుల పర్యవేక్షణ కోసం స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. దీనికి తోడుగా క్షేత్రస్థాయిలో కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మండల కమిటీలను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 9 మందితో ఏర్పాటు చేసే కమిటీలో సభ్యులుగా ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీకి ఎంపీడీవో చైర్మన్‌గా, కన్వీనర్‌గా ఎంపీవో ఉంటారు. జిల్లాలో మండల స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీలు ఎనిమిది అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌-గ్రామీణ(వీబీ-జీరామ్‌జీ) కూలీలకు వేతన అభివృద్ధి, పశుగ్రాసం, తాగునీరు, తాగునీటి భద్రత, జీవనోపాధి పనులు, నీటి సంరక్షణ, గ్రామీణ సదుపాయాలపై కమిటీ పని చేస్తుంది. ప్రతివారం సమావేశమై ప్రజలు, కరువు సమస్యలపై చర్చిస్తారు. మంజూరు చేసిన పనులు, జలసిరి తదితర కార్యక్రమాలపై పంచాయతీల వారీగా కమిటీ సమీక్షిస్తుంది. నివారణ చర్యలపై సమన్వయం చేస్తారు. తీసుకున్న నిర్ణయాలను కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. జిల్లాలో ఉన్న చిన్ననీటిపారుదల చెరువులు, కుంటల పరిస్థితిపై సమగ్ర సర్వే చేస్తారు. ఎంత మేరకు పూడిక పేరుకుపోయింది, కట్టలు, తూములు, అలుగులు, ఫీడర్‌ ఛానళ్లకు ఎటువంటి మరమ్మతులు అవసరం అవుతాయో అంచనాలు వేస్తారు. చెరువులు, కాల్వల మరమ్మతులు, వ్యవసాయ కుంటలు, చెక్‌ డ్యాములు, బోర్‌వెల్‌ రీఛార్జ్‌ నిర్మాణాలు, వర్షపు నీరును ఒడిసిపట్టే పనులను వీబీ-జీరామ్‌జీ నిబంధన ప్రకారం ఎంపిక చేస్తారు. పశుగ్రాసం సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ బోర్లు ఉన్న రైతులను వ్యక్తిగతంగా ప్రోత్సహించి పచ్చిమేత కొరతను నివారించేందుకు దృష్టి పెడుతారు. పశువులు, గొర్రెలు మేకలకు తాగునీరు అందించేందుకు ఉన్న నీటి తొట్టెలను పరిశీలించి అవసరమయ్యే మరమ్మతులు చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన చోట కొత్తవి నిర్మించడానికి ప్రతిపాదాలను రూపొందిస్తారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో పనులను ఉంచే విధంగా చూస్తారు. ఇప్పటికే వీబీ-జీరామ్‌జీ పథకం కింద యాక్టివ్‌ జాబ్‌ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించేందుకు పని దినాలను కూడా పెంచే విధంగా గ్రామ సభలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించారు.

జలసిరి పనులపై ప్రత్యేక దృష్టి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు, కుంటలు ఇప్పటికే 70 శాతం నీళ్లు తగ్గిపోయి భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితులు అధిగమించే దిశగా నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండలాల వారీగా ఆరు రకాల నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీ పరిధిలో 1021 ఫారంపాండ్స్‌(ఊట కుంటలు) లక్ష్యంగా 575 పనుల మంజూరు కాగా 263 మొదలయ్యాయి. 46693 వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా 2051 పనుల మంజూరు కాగా 1372 మొదలయ్యాయి. 780 రూఫ్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ లక్ష్యంగా 229పనుల మంజూరు కాగా 153 మొదలయ్యాయి. 33321 బోర్‌వెల్‌ రీఛార్జీ నిర్మాణాల లక్ష్యం కాగా, 1256 పనుల మంజూరు కాగా 877 మొదలయ్యాయి. 12 ఓపెన్‌వెల్స్‌ లక్ష్యంగా ఒక పని మంజూరుకాగా ఒకటి మొదలైంది. 240 పెర్కోలేషన్‌ ట్యాంకులు లక్ష్యంగా 44 పనుల మంజూరుకాగా 12 మొదలయ్యాయి. జిల్లాలో 477994మంది జనాభా ఉండగా 129080 మంది రైతులు ఉన్నారు. దీనికి సంబంధించిన పొలాల్లో 1021ఫామ్‌ పాండ్స్‌ నిర్మించడం ద్వారా వర్షపు నీటి నిల్వచేసి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా ఎల్‌నినో వంటి వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు నీటి కొరత తీరే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గ్రామాల్లో నిర్మించే పెర్కోలేషన్‌ ట్యాంకుల ద్వారా భూగర్భ జలాలు వృద్ధిచెందుతాయి. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెంపొందించేందుకు దోహదపడుతుంది. బోర్‌వెల్‌ చుట్టూ గుంతల నిర్మాణంతో వర్షపు నీరు బోర్‌వెల్‌ లోపలికి వెళ్లి రీచార్జి చేస్తుంది. ఓపెన్‌వెల్‌ చుట్టూ కూడా ఏర్పాటు చేసే నిర్మాణాల వల్ల భూగర్భ జలాల అభివృద్ధి పెరిగి భవిష్యత్తులో సాగు, తాగునీటి ఇబ్బందులు కలవకుండా ఉండడమే కాకుండా జీరామ్‌జీ పథకంలో కూలీలకు పనులు కూడా లభిస్తున్నాయి.

జిల్లాలో జలసిరి నీటి సంరక్షణ పనుల లక్ష్యం ఇలా..

మండలం గ్రామాలు - ఫామ్‌పాండ్స్‌ బోర్వెల్‌ రీఛార్జి వ్యక్తిగత ఇంకుడు గుంతలు రూప్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ -పెర్కోలేషన్‌ ట్యాంక్‌

బోయిన్‌పల్లి 23 91 1435 4441 69 23

చందుర్తి 19 90 2214 3801 57 21

ఇల్లంతకుంట 35 149 3177 5473 105 29

గంభీరావుపేట 22 103 3660 5322 66 22

కోనరావుపేట 28 104 4815 4623 84 26

ముస్తాబాద్‌ 22 127 3392 5003 66 21

రుద్రంగి 10 32 1263 1821 30 08

తంగళ్ళపల్లి 30 104 4864 5735 90 28

వీర్నపల్లి 17 51 1977 1509 51 16

వేములవాడ 17 55 851 1861 33 10

వేములవాడ రూరల్‌ 11 65 851 1869 51 12

ఎల్లారెడ్డిపేట 26 50 4822 5235 78 24

మొత్తం 260 1056 33321 46693 780 240

Updated Date - Oct 31 , 2026 | 12:13 AM