Share News

మూడు నెలల రేషన్‌ ఒకేసారి..

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:27 AM

వేసవి ప్రతాపం మార్చిలోనే మొదలైంది. భగ్గుమంటున్న ఎండల్లో ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో రేషన్‌ లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం అందించడానికి పౌరసరఫరాల శాఖలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా మొదలైంది.

మూడు నెలల రేషన్‌ ఒకేసారి..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వేసవి ప్రతాపం మార్చిలోనే మొదలైంది. భగ్గుమంటున్న ఎండల్లో ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో రేషన్‌ లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం అందించడానికి పౌరసరఫరాల శాఖలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా మొదలైంది. గతంలోనూ వర్షాకాలం ప్రారంభంలో జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి పంపిణీ చేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో 4.56 లక్షల మెట్రిక్‌ టన్నుల దాన్యం వచ్చే అవకాశాలు ఉండగా పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోళు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ముందస్తుగా గోదాములను ఖాళీ చేసేందుకు సైతం మూడు నెలల రేషన్‌ పంపిణీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సీఎంఆర్‌ సంబంధించిన బియ్యం కూడా గోదాముల్లో నిల్వ ఉంది. ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగానే కొత్త బియ్యాన్ని గోదాములకు తరలించేందుకు మూడు నెలల బియ్యం పంపిణీ వెసులుబాటుగా మారనుంది.

ఫ బియ్యం కోటా 11,172 మెట్రిక్‌ టన్నులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు నెలల బియ్యం పంపిణీ కోసం 11,172.165 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. జిల్లాలో ఉన్న 5.75 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందిస్తున్న బియ్యం ఈసారి మూడు నెలల కోటాగా ఇవ్వనున్నారు. ఇందుకు సరిపడా బియ్యం రేషన్‌ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుతున్నారు. దీంతోపాటు గతంలో రేషన్‌ లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారించే దిశగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేశారు. ప్రస్తుతం గోదాముల్లో నిలువ ఉన్న మేరకు సరఫరా చేసి తర్వాత రెగ్యులర్‌ సన్నరకం బియ్యాన్ని పంపిణీ చేస్తారు. 2021 సంవత్సరంలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద ప్రజలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యంలో ఒక శాతం పోషకాలు కలపాలని నిర్ణయించారు. దీంతో ఒక క్వింటాల్‌ బియ్యంలో ఒక కిలో ఎఫ్‌ఆర్‌కె బియ్యం ఉంటాయి. ఒక శాతం ఎఫ్‌ఆర్‌కే కలపడానికి జిల్లాలో 130 రైస్‌ మిల్లులు ఉండగా, దాదాపు అన్ని మిల్లులో రూ.10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేసి ఎఫ్‌ఆర్‌కే మిషనరీలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రేషన్‌ లబ్ధిదారులతోపాటు అంగన్‌వాడీ, హాస్టళ్లలో, రెసిడెన్షియల్‌ పాఠశాలకు ఎఫ్‌ఆర్‌కే బియ్యమే వాడుతున్నారు. ఇప్పటికే బియ్యం సరఫరాలో నాణ్యత లేకపోవడం, ప్లాస్టిక్‌ బియ్యమని, పిండితో కల్తీ చేశారని రకరకాల ప్రచారంతో అపోహలు వచ్చాయి. అంతేకాకుండా ఎఫ్‌ఆర్‌కే బియ్యం ఎక్కువ రోజులు గోదాముల్లో నిల్వ ఉండడం వల్ల పోషకాలు అనుకున్నంత మేరకు ఉండడం లేదనే కారణంగానే బియ్యం నిలిపివేస్తున్నట్లు తెలిసింది.

జిల్లాలో 5.75 లక్షల మంది లబ్ధిదారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు ఉండగా, 1,95,554 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 5,75,463 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆహార భద్రత కార్డులు 1,81,526 ఉండగా, లబ్ధిదారులు 5,39,675 మంది, అంత్యోదయ కార్డులు 13,829 ఉండగా, లబ్ధిదారులు 35,583 మంది ఉన్నారు. అన్నపూర్ణ కార్డులు 199 ఉండగా, 205 మంది లబ్ధిదారులు ఉన్నారు.

జిల్లాలో రేషన్‌ కార్డులు.. లబ్ధిదారులు..

మండలం కార్డులు లబ్ధిదారులు బియ్యం (కిలోలు)

బోయిన్‌పల్లి 13,276 37,591 7,20,372

చందుర్తి 12,181 35,264 6,59,103

గంబీరావుపేట 15,810 46,291 9,33,084

ఇల్లంతకుంట 17,335 49,345 8,74,827

కోనరావుపేట 15,642 46,121 8,73,954

ముస్తాబాద్‌ 16,614 49,195 9,32,016

రుద్రంగి 5,505 17,470 3,29,697

సిరిసిల్ల 30,351 91,418 19,97,955

తంగళ్లపల్లి 16,054 46,281 9,10,677

వీర్నపల్లి 4,781 15,037 2,83,506

వేములవాడ 22,056 66,176 4,53,294

వేములవాడ రూరల్‌ 8,436 24,209 12,43,920

ఎల్లారెడ్డిపేట 17,479 51,065 9,59,760

మొత్తం 1,95,554 5,75,463 1,11,72,165

Updated Date - Mar 29 , 2026 | 12:27 AM