మూడు నెలల రేషన్ ఒకేసారి
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:48 PM
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ప్రజలకు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్‌లో ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
సుల్తానాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ప్రజలకు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్‌లో ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ప్రధాన గోదాముల నుంచి జిల్లా లోని లబ్ధిదారులకు సరిపడా బియ్యం నిలువలను సివిల్ సప్లయి గోదాములకు దిగుమతి చేస్తుండగా, అక్కడి గోదాముల నుంచి మూడు రోజులుగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాలలోని రేషన్ దుకాణా లకు బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచుతున్నారు. ఏప్రిల్ ప్రారంభం నుంచే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఇవ్వనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధిం చిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడు నెలల రేషన్ కోటా పంపిణీ కార్యక్రమం పదిహేను రోజుల్లో పూర్తి చేసేం దుకు తగిన ప్రణాళిక రూపొందించుకున్నారు. వేస విలో ఎండల తీవ్రత అధికంగా ఉండనున్న కారణంగా ప్రజలు రేషన్ బియ్యం కోసం దుకాణాల ఎదుట క్యూలో నిల్చోవడం ఇబ్బందిగా ఉంటుందని ప్రభుత్వం భావించి ఈ మేరకు ఏప్రిల్‌లోనే మూడు నెలల కోటా ఇచ్చేం దుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నారు. ఇలా ఏప్రిల్‌లో కూడా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేసేం దుకు జిల్లాలోని గోదాముల్లో బియ్యం నిలువలు కూడా తగినన్ని అందుబాటులో ఉన్నాయి. కాగా, మరి కొన్ని రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఆ పం టకు సంబంధించిన బియ్యం నిలువలు పెట్టుకోవడానికి గోదాముల్లో స్థలం లేకుండా పోయిందని, ధాన్యం దిగు బడులను నిలువ చేసేందుకు ప్రస్తుత గోదాములను మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇచ్చి ఖాళీ చేయిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా మరో వారం రోజుల్లో ప్రజలు సమీప రేషన్ దుకాణాల నుంచి మూడు నెలల బియ్యంను ఒకేసారి పొందవచ్చు.
జిల్లాలో రెండు లక్షలకు పైగా తెల్లకార్డులు
పెద్దపల్లి జిల్లాలో దాదాపు రెండు లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉండగా 7 లక్షల 14 వేల 594 మంది లబ్ధిదారులు ఉన్నారు. 410 రేషన్ దుకాణాలున్నాయి. వీరికి ప్రతీ నెల నెలా 4,500 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం మూలంగా జిల్లాలో 13,584 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారు.