సింగరేణిలో దొంగలు పడ్డారు...
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:35 PM
సింగరేణిలో ఆదాని, అంబానీల రూపంలో దొంగలు పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం గోదావరిఖని జీఎం ఆఫీస్ గ్రౌండ్‌లో జరిగిన సింగరేణి కార్మికుల కవాతులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సింగరేణి 80 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని, దీనిలో కొనసాగడానికి కార్మిక వర్గం గర్వపడాలన్నారు.
గోదావరిఖని, జూలై 24(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో ఆదాని, అంబానీల రూపంలో దొంగలు పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం గోదావరిఖని జీఎం ఆఫీస్ గ్రౌండ్‌లో జరిగిన సింగరేణి కార్మికుల కవాతులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సింగరేణి 80 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని, దీనిలో కొనసాగడానికి కార్మిక వర్గం గర్వపడాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎంఎండీఆర్ చట్టం వల్ల సింగరేణికి కొత్త గనులు రాకుండా పోయాయని, దీనికి అనుకూలంగా పార్లమెంటులో ఎంపీ కవిత తదితరులు ఓటు వేసారని ఆరోపించారు. అటువంటి సంఘానికి నేడు కార్మికుల గురించి, ఏఐటీయూసీ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల సింగరేణికి కొత్త గనులు రావడం లేదని ఆయన అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం 31డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చామని, దీనిపై ఈ నెల 28న చర్చలు జరుగనున్నాయని, ఒకవేళ చర్చలు విఫలమైన పక్షంలో ఆర్‌ఎల్‌సీ నుంచి ఫెయిల్యూర్ రిపోర్ట్ తీసుకొని ఆగస్టు 15తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని, ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కవాతుకు ఆర్‌జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను ఆహ్వానం పలికారు. అంతకు ముందు మాదిరెడ్డి భాస్కర్‌రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రదర్శనగా జీఎం గ్రౌండ్‌కు చేరుకున్నారు. కవాతులో ఆర్‌జీ-1, 2, 3 బ్రాంచ్‌ల ఆఫీస్ బేరర్స్, పిట్ కార్యదర్శులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభలో కళాకారులు ఎజ్జ రాజయ్య, చీకటి అంజన్న, వై లెనిన్‌లు కార్మిక గేయాలు ఆలపించారు. ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడారు. నాయకులు వైవీ రావు, వీరభద్రం, కవ్వంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, జూపాక రాంచందర్, బాజీసైదా, గంధం సాంబశివరావు, మందల రాంచంద్రారెడ్డి, సీపీఐ నాయకులు గౌతం గోవర్ధన్, కే కనకరాజ్, కార్పొరేటర్ సూర్య, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు ఎంఏ గౌస్, వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, క్రాంతి కిరణ్‌లు పాల్గొన్నారు.