గణపతి ఎప్పుడు లొంగిపోతారనే సమాచారం లేదు
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:30 AM
గణపతి ఎప్పుడు లొంగిపోతారనే విషయమై తమకు సమాచారం ఏమీ లేదని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. రామగుండంలో ఆదివారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో నిర్మించిన పోలీస్ గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కోల్‌సిటీ, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): గణపతి ఎప్పుడు లొంగిపోతారనే విషయమై తమకు సమాచారం ఏమీ లేదని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. రామగుండంలో ఆదివారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో నిర్మించిన పోలీస్ గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అర్బన్‌లో మావోయిస్టు సానుభూతిపరులు ఉంటే ఉండవచ్చేమో కానీ సాయుధ నక్సలైట్లు లేరన్నారు. అనంతరం రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధానమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారన్నారు. గతంలో రవాణా శాఖ మాత్రమే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించేదని, ఈసారి ప్రభుత్వంలోని అన్ని శాఖలు భాగస్వాములు అవుతున్నారన్నారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయని, వాటిపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే ’అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణలు నిర్వహించడం, సీట్‌బెల్ట్, హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయించేలా చూడాలన్నారు. ప్రస్తుతం నేరాలు కొత్త రూపాలు దాల్చుతున్నాయని, నేరస్తులు టెక్నాలజీ వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతీ అధికారి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ బీ రాంరెడ్డి, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, జగిత్యాల ఎస్‌పీ అశోక్‌కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్‌పీ మహేష్ బీ గీత్, ఏసీపీలు, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.