Share News

ముహూర్తాలున్నాయి.. వధువెక్కడ?

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:12 AM

పెళ్లి వేడుక ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన సంబరం. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. కల్యాణం కమనీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పెళ్లి తంతు కోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు తరలివస్తారు. ఇప్పుడు పెళ్లిళ్ల ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసం ముహుర్తాలకు నెలవు. కానీ వధువు ఎక్కడ..? అనే పరిస్థితుల్లో అబ్బాయిలు ఆరాట పడుతున్నారు.

ముహూర్తాలున్నాయి.. వధువెక్కడ?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పెళ్లి వేడుక ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన సంబరం. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. కల్యాణం కమనీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పెళ్లి తంతు కోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు తరలివస్తారు. ఇప్పుడు పెళ్లిళ్ల ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసం ముహుర్తాలకు నెలవు. కానీ వధువు ఎక్కడ..? అనే పరిస్థితుల్లో అబ్బాయిలు ఆరాట పడుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు ‘మా అబ్బాయి... ఎంటెక్‌ అయిపోయింది. సంవత్సరానికి రూ.12 లక్షలకు పైగా సంపాదన వస్తోంది. ఎక్కడైనా అమ్మాయి ఉంటే చెప్పండి’.. ‘మా వాడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. పట్టింపులేవీ లేవు.. కట్నకానుకలు అవసరంలేదు.. అమ్మాయి అందంగా ఉంటే చాలు..’ ఇలా వధువుల కోసం వెతుకులాడుతున్న సందర్భాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిత్యం కనిపిస్తున్నాయి. కారణం చదువు, ఉద్యోగం ఆర్థికంగా స్థిరపడిన తరువాత వివాహం ఆలోచనలోకి వెళ్లడంతో అబ్బాయిలు ముదిరిపోయి పెళ్లికాని ప్రసాద్‌లుగా మారిపోతున్నారు. మరోవైపు ఆడశిశువు అనగానే గర్భంలోనే చంపేస్తున్న ఘటనలతో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జీవితాంతం ఆనందమయంగా గడపాలని అందరు కోరుకుంటారు. తమ జీవితాన్ని ఆకర్షణీయంగా ఉండాలని ఆశిస్తారు. అందుకోసం ఉద్యోగం, డబ్బు సంపాదనే ముఖ్యమనే తత్వంతో యువకులు ఉండిపోతున్నారు. అదేక్రమంలో యువతులు కూడా చక్కని ఉద్యోగం చేసే భర్త కావాలని కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే జీవితంలో స్థిరపడాలనే తపనతో ఈడుదాటిపోవడంతో యువకులు వధువుల కోసం వెతుకులాడే పరిస్థితి పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా ‘ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే చెప్పండి.. మా వాడు బెంగుళూర్‌, ముంబై, పుణేలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేస్తున్నాడు..’ అంటూ తల్లిదండ్రులు అడుగుతున్న తీరు తరచూ కనిపిస్తోంది. గతంలో ఉన్న పట్టింపులను కూడా మరిచి ‘రాశి, నక్షత్రం, గోత్రం వంటి వాటిపై పట్టింపులు లేవు.. అమ్మాయి బాగుంటే చాలు’ అని అడుగుతున్న వారు కూడా ఉన్నారు. మరోవైపు సంపాదనలో ఉన్న యువకులు మరో సంపాదించే అమ్మాయే భార్యగా రావాలని కోరుంటున్న వారు కూడా ఉన్నారు. దీంతో అందమైన పిల్ల, ముల్లె రెండు ఒకచోట లభించక కూడా పెళ్లి సంబంధాలు చూస్తుండడంతోనే వయస్సు కాస్తా దాటిపోతోంది.

మ్యారేజ్‌ బ్యూరోల వెంట పరుగులు

రాజన్న సిరిసిల్ల జిల్లాల పెళ్లికాని యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. యువకుల వివాహ వయస్సు 21 నుంచి 28 ఏళ్లలోపుగా భావిస్తారు. జిల్లాలో 30 ఏళ్ల వరకు దాదాపు 68 వేల మంది యువకులు ఉన్నట్లుగా అంచనా వేశారు. ఇందులో 30 ఏళ్లు పైబడి పెళ్లి వయసు దాటిన వారు 37 వేల మంది ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 2026 జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో 24 మంది 30ఏళ్ల వరకు వివాహాలు చేసుకోవడం లేదని తెలుస్తోంది. వయస్సు పైబడిన తర్వాత యువతులు దొరకని పరిస్థితుల్లో మ్యారేజ్‌ బ్యూరోల వెంట పరుగులు తీస్తున్నారు. చివరకు వరకట్నం తీసుకోవడం కాదు పెళ్లి ఖర్చులతో పాటు అన్ని భరించి పెళ్లికి సిద్ధమవుతున్న వారు ఉన్నారు. మరికొందరు కులాల పట్టింపులు వదిలేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమ్మాయిల దొరకకపోవడంతో ఆంధ్ర ప్రాంతం ఇటీవల ఎక్కువ సంబంధాలు కుదిరించుకుంటున్నారు. మంచి ఉద్యోగం, అత్యధిక ప్యాకేజీలు ఉన్నప్పటికీ కుటుంబ నేపథ్యం ప్రధానంగా చూస్తూ యువతకు సంబంధాలు దొరకని పరిస్థితి ఉంది. శ్రావణమాసం, కార్తీకమాసం వచ్చిందంటే యువకుల తల్లిదండ్రులు సంబంధాల వేటలో పడుతున్నారు. ఆస్తి, హోదా పలుకుబడి ఉన్న ఏదో కారణాలతో సంబంధాలు దొరకని పరిస్థితుల్లో తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.

సహజీవనం మధురమైనది..

సహజీవనం అనేది ఒక మధురమైన జీవన విధానం. దాంపత్య జీవనం సరిగమల్నే పలికించాలి. అపస్వరాలకు చోటివ్వకుండా సాఫీగా సాగిపోవాలి. కానీ చాలా కాపురాలు కుప్ప కూలిపోతున్నాయి. అందుకు కారణం వయస్సు పైబడిపోయిన తరువాత వివాహాలు చేసుకోవడం ఇద్దరు సంపాదన రంగంలో ఉండడం వంటి అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. గతంలో 18ఏళ్లలోపే ఏ పనిచేసినా చేయకపోయినా పెద్దలు వివాహాలు జరిపించేవారు. ఇప్పుడు మారుతున్న కాలంలో ఉన్నత చదువులు, ఆర్థికంగా స్థిరపడిన తరువాతే వివాహం చేసుకోవాలని భావిస్తుండడంతోనే 40 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో చివరకు ఎవరైనా సరే అనుకున్నప్పటికీ అమ్మాయిలు మాత్రం దొరకడం లేదు. కట్నకానుకల పట్టింపులేదని అబ్బాయిలు ముందుకువచ్చినా అమ్మాయిలు తక్కువ చదువుకున్నా కనీసం డిగ్రీ చదివి ఉండాలని కోరుతున్నారు. కొందరు యువకులు వ్యాపార రంగంలో రాణిస్తున్న ఉద్యోగులు కావాలని అమ్మాయి తల్లిదండ్రులు చూస్తుండడంతో వ్యాపార రంగంలో ఉన్న యువకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య రోజురోజుకు పెరగడానికి మరో కారణం అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడమేనని లెక్కలు చెబుతున్నాయి. యువకులతో పోల్చుకుంటే యువతుల సంఖ్య తక్కువగా ఉండడంతో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అందుకే మ్యారేజ్‌ బ్యూరోలు కూడా పెరిగిపోతున్నాయి. మ్యారేజ్‌ బ్యూరోల వద్ద అమ్మాయిలు కావాలనే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది.

లేటు వయస్సు పెళ్లిళ్లతో ఇబ్బందులు...

వయస్సు దాటిన తరువాత వివాహాలు చేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. సరైన వయస్సు వివాహం జరుగకపోవడంతో పిల్లలు కలుగక మానసికంగా ఆందోళన పడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు పిల్లలు కలిగినవారు చదువుకునే వయస్సులో తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్లిపోవడంతో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు.

శ్రావణమాసంలో బోలెడన్ని మంచి ముహూర్తాలు

శ్రావణమాసం ప్రారంభంతోనే బోలెడన్ని మంచి ముహూర్తాలు వచ్చినా అమ్మాయిలు దొరకని పరిస్థితుల్లో పెళ్లి సందడి కోసం అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. శ్రావణమాసం ప్రారంభం కావడంతోనే మంచి ముహూర్తాలు వచ్చాయి. ఆగస్టులో 16,17,20,21,22,23,26,27,28,29,30, సెప్టెబరులో 3,4,5,8,10 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ఎక్కువ పెళ్లిళ్లు జరపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు గృహప్రవేశాలు, పిల్లలకు కేశఖండనలు, ఉపనయనాలు, నిశ్చితార్థం, ఇతర వ్యాపార సంబంధమైన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 11న శ్రావణం పూర్తికావడంతోనే భాద్రపద మాసం ప్రారంభం అవుతుండటంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆశ్వయుజ, కార్తీక మాసాల వరకు ఆగాల్సిందే. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెళ్లి సందడి మొదలైంది. వీటి కోసం ఇప్పటికే ఫంక్షన్‌హాళ్ల నుంచి మొదలుకొని క్యాటరింగ్‌, పెళ్లి మండపాలు, బ్యాండ్‌ మేళాలు, పురోహితుల వరకు బుకింగ్‌లు జరిగిపోతున్నాయి. ఆభరణాలు, వస్త్రాల దుకాణాల్లో పెళ్లి సందడి మొదలైంది. మరోవైపు హంగామా... ఆర్భాటాలు... మూడు ముళ్ల బంధం మూడు తరాలు చెప్పుకునే విధంగా ఖర్చుకు వెనుకాడడం లేదు. ఎట్రాక్షన్‌ కోసం పాతకాలపు సంప్రదాయాలను చూపుతున్నారు. ప్రత్యేకతను చాటుకోవడానికి వివాహ వేడుకల్లో కొత్తకొత్త అంశాలు చేరుస్తున్నారు. వెడ్డింగ్‌ కార్డు నుంచి భోజనాల ప్లేట్ల వరకు ఏకో ఫ్రెండ్లీని జతచేస్తున్నారు. ఇక భారీ సెట్టింగ్‌లు... సెలబ్రిటీల డ్యాన్స్‌లు... సంగీతం... అతిథులకు పోటీలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్లి ఒక పవిత్ర బంధంగా ఆరురోజుల పాటు జరిపించేవారు. ఇప్పుడు అర రోజుకు పరిమితం చేశారు. అకాశమంత పందిరి వేసినా పెళ్లి కొడుకు బంధువులు ఇరువురు ఒకేచోట ఏదో ఒక ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లిళ్లను మాత్రం అర రోజులోనే పూర్తి చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌ హాల్‌లో ఒకేరోజు రెండు పెళ్లిళ్లు ఉంటే వీరు మధ్యాహ్నం వరకే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఉంది.

Updated Date - Aug 23 , 2026 | 12:12 AM