Share News

ఉపాధ్యాయుల మాట బంగారు బాట

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:25 AM

విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. నేటి విద్యార్థులే రేపటి ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయుల మాట బంగారు బాట

జ్యోతినగర్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. నేటి విద్యార్థులే రేపటి ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ టీటీఎస్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే తొలి గురువులని, వారి తర్వాత ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమస్యలు, సందేహాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే 1908కు తెలియజేయాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 112కు కాల్‌ చేయాలని వివరించారు. విద్యార్థుల భద్రతపై పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని సీపీ తెలిపారు. అయితే విద్యార్థులే తమ భద్రతకు తొలి రక్షకులని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీసీపీ రాంరెడ్డి, సీఐ కృష్ణకుమార్‌, సైబర్‌ నేరాల విభాగం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

సైబర్‌ భద్రతపై పోస్టర్‌ ఆవిష్కరణ

వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణ సైబర్‌ భద్రతా విభాగం రూపొందించిన వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు అవగాహన పోస్టర్‌ను సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, డీసీపీ బి.రాంరెడ్డి ఆవిష్కరించారు. సైబర్‌ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరిస్తూ పోస్టర్‌ను రూపొందించారు. ఎంఈఓ మల్లేశం, సీఐ కృష్ణకుమార్‌, ఎస్‌ఐలు ఉదయ్‌ కిరణ్‌, శ్రీధర్‌, సంధ్యారాణి, వెంకట్‌, ప్రధానోపాధ్యాయుడు జి.జయరాజ్‌, కార్పొరేటర్‌ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:25 AM