పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:55 PM
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై భారం ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
మంథని, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై భారం ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి డివిజన్‌లోని 4 మండలాలకు చెందిన చేయూత పెన్షన్లు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్‌బాబు పంపిణీ చేశారు. మంథనిలో నూతన భవనంలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలను, ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. గోదావరినది వద్ద కొనసాగుతున్న పుష్కరాల అభివృద్ధి పనులను, క్రీడామైదానాన్ని, జిమ్, లాన్ టెన్నిస్ కోర్టును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుల కారణంగా సుమారు రూ.8 లక్షల కోట్ల ఆర్థిక భారం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే, ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు సుమారు 4,7 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేశామన్నారు. పేదలు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీకి సుమారు రూ. 13 వేల కోట్లు చెల్లించిందన్నారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, 10 లక్షల మంది రైతులకు సుమారు రూ.21 వేల కోట్ల మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేశామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెంచడంతో పాటు, సన్నధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాలుకు రూ.5 వందల బోనస్ అందిస్తున్నామన్నారు. పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన కుటుంబాలకు 16 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు అందించామన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పథకానికి సంబంధించి అధికారులు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారన్నారు. గోదావరినది వద్ద కొనసాగుతున్న ఘాట్, రోడ్డు విస్తరణ, ఇతర పనుల్లో వేగం పెంచి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. విద్యకు నిలయమైన మంథనిని సరస్వతి నిలయంగా మారుస్తామన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు మంజూరు చేయించిన మంథని సంగీత కళాశాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. మండలంలోని అడవిసోమన్‌పల్లిలో నిరిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్‌లో 2027 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్‌పూర్, మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో కొత్తగా 2464 మంది చేయూత పింఛను లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారిని గుర్తించి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, కమీషనర్ మనోహర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.