ఆగిన ధీమా..
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:31 AM
నేల తల్లిని నమ్ముకున్న అన్నదాత పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు అనేక కష్టనష్టాలను అనుభవిస్తాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలవలేక కొందరు రైతులు బలవన్మరణాలను ఆహ్వానిస్తారు. మరికొందరు పంట పొలాల్లో పురుగుల మందులు చల్లుతూ అనారోగ్యానికి గురై, పొద్దంతా కష్టపడి అలసటతో ఊపిరి అగి మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
నేల తల్లిని నమ్ముకున్న అన్నదాత పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు అనేక కష్టనష్టాలను అనుభవిస్తాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలవలేక కొందరు రైతులు బలవన్మరణాలను ఆహ్వానిస్తారు. మరికొందరు పంట పొలాల్లో పురుగుల మందులు చల్లుతూ అనారోగ్యానికి గురై, పొద్దంతా కష్టపడి అలసటతో ఊపిరి అగి మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉండే అన్నదాత ఎలా చనిపోయినా ఆ కుటుంబానికి కాస్త చేదోడుగా ఉండే విధంగా ఎల్‌ఐసీ ద్వారా ఫార్మర్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిన రైతు బీమా ధీమాగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించి రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా పరిహారం అందే విధంగా కుటుంబ సభ్యులకు కాస్త ఓదార్పుగా ఉన్న బీమాను 2026-27 సంవత్సరానికి రెన్యువల్ చేయకుండా ప్రభుత్వం నిలిపివేసింది. రైతు బీమా పథకంపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకుండానే నిలిపివేయడంతో రైతు కుటుంబాల్లో నిరాశతో కూడిన ఆందోళన నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి సంవత్సరం 80 వేలకు పైగా రైతులు బీమా పథకంలో అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రైతులకు అందించే బీమాపై ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నుంచి కొత్త బీమా పాలసీ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టేది. ఈ సంవత్సరం ఆగస్టు 13తోనే బీమా పాలసీ ముగిసిపోయింది. ప్రభుత్వం రైతు బీమా పథకం బదులుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నా దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. రైతు బీమా తరహాలోనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు వర్తింపచేస్తారని అందులో భాగంగానే రైతు బీమా ప్రీమియం చెల్లించలేదని భావిస్తున్నారు. మరోవైపు రైతు బీమా నిలిచిపోవడంతో పథకం వచ్చేవరకు ఎవరైనా రైతు చనిపోతే వారి కుటుంబానికి ఎలా ఆర్థిక చేయూత అందిస్తారో తెలియక రైతు కుటుంబాల్లో అయోమయం నెలకొంది.
జిల్లాలో 8 ఏళ్లుగా రైతు కుటుంబాలకు రూ.1970 కోట్ల పరిహారం..
అన్నదాతల కుటుంబాల్లో యజమాని ఏ విధంగా మృతిచెందిన ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతుంటాయి. అలాంటి పరిస్థితులు వెంటనే ఎదుర్కోకుండా తక్షణ ఉపశమనంగా బాధిత కుటుంబానికి రూ 5 లక్షల పరిహారం అందించే విధంగా ఏర్పాటు చేసిన రైతు బీమా పథకంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 సంవత్సరాల్లో 3941 మంది రైతులు మృతిచెందగా బాధ్యత కుటుంబాలకు రూ.1970 పరిహారం అందించారు. 2025-26 సంవత్సరంలో జిల్లాలో 394 మంది రైతులు మృతిచెందగా 308 కుటుంబాలకు రైతు బీమా కింద రూ.15.40 కోట్లు పరిహారం చెల్లించారు. 2018-19లో 318 మంది, 2019-20లో 337మంది, 2020-21లో 536మంది, 2021-22లో 387మంది, 2022-23లో 376మంది, 2023-24లో 385 మంది, 2024-25లో 336 మంది, 2025-26లో 391మంది రైతులు చనిపోగా వారి కుటుంభాలు బీమా సాయాన్ని పొందారు. ఇప్పటివరకు రూ.1970 కోట్ల వరకు బీమా పరిహారం పొందారు. ప్రతి సంవత్సరం జిల్లాలో నుంచి 18-59 ఏళ్ల వయస్సుగల 80 వేలకు పైగా రైతు కుటుంబానికి ధైర్యంగా బీమా నిలుస్తూ వచ్చింది. గతంలో పాలసీలో ఉన్న వారందరి డేటాను పరిశీలించి తిరిగి పాలసీని పునరుద్ధరించేవారు. ఇందులో 60సంవత్సరాలు నిండిన రైతులను తొలగించేవారు. రైతు బీమా నమోదు చేసుకున్న రైతులు వారి నామినీ ఏదైనా కారణంతో మృతిచెందినా, కొత్త నామినీలను నమోదు చేసే అవకాశం కల్పించింది. కొత్త నామినీ ఆధార్, బ్యాంక్ ఖాతా పాటు ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 15న గత ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కూడా బీమా పథకం గుర్తింపు వచ్చింది. రైతు ఏ విధంగా మృతిచెందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందే విధంగా ప్రభుత్వం ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించింది. ఒక్కో రైతుకు ప్రీమియం మొదట్లో రూ 2271 ఉండగా తర్వాత రూ 3536 చేరిన చెల్లిస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నుంచి మరుసటి సంవత్సరం ఆగస్టు 13 వరకు రైతు బీమా పథకం అమలులో ఉండేది. ప్రస్తుతం ఈ బీమా పథకం నిలిచిపోయింది.
జిల్లాలో వ్వవసాయ లెక్కలు ఇలా..
ప్రభుత్వం గతంలో జరిపిన వ్యవసాయ గణాంకాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 110883 మంది రైతులకు సంబంధించి 243157.16 ఎకరాల వ్యవసాయ భూమి లెక్కలోకి వచ్చింది. ఇందులో 2.47 ఎకరాలకు సంబంధించి 75931 రైతులకు 81416.67 ఎకరాలు, 2.48 నుంచి 4.93 ఎకరాల వరకు 25092 మంది రైతులకు 86460.76 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు వరకు 8346 మంది రైతులకు 53560.38 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాల వరకు 1427 మంది రైతులకు 18962.56 ఎకరాలు, 24.71 ఎకరాలకు పైగా ఉన్నవారు 87 మందికి 2756.79 ఎకరాలు ఉంది. ఇందులో ఎస్సీలకు సంబంధించి 15219 మంది రైతులకు 25242.04 ఎకరాల భూమి ఉంది. ఎస్టీలకు సంబంధించి 3742 మంది రైతులకు 8769.14 ఎకరాల భూమి ఉండగా, ఇతర సామాజిక వర్గాల్లో 91919 మంది రైతులకు 209627.17 ఎకరాలు ఉంది. 20879 మంది మహిళా రైతులకు 44460.15 ఎకరాల భూమి ఉంది.
జిల్లాలో భూములు, రైతులు..
మండలం రైతులు ఎకరాల్లో భూమి
రుద్రంగి 2,021 6,173.99
చందుర్తి 9,037 20,485.94
వేములవాడ రూరల్ 7,099 16,086.33
బోయినపల్లి 8,152 19,316.41
వేములవాడ 6,446 14,146.04
సిరిసిల్ల 3,641 5,287.59
కోనరావుపేట 11,979 25,436.59
వీర్నపల్లి 2,787 5,077.68
ఎల్లారెడ్డిపేట 10,223 20,985.20
గంభీరావుపేట 11,053 20,358.17
ముస్తాబాద్ 11,860 28,672.67
తంగళ్ళపల్లి 12,774 24,193.96
ఇల్లంతకుంట 13,811 36,936.59
------------------------------------------------------------
మొత్తం 1,10,883 2,43,157.16