డ్రగ్స్ సరఫరా మూలాలను సమూలంగా చేధించాలి...
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:40 PM
పోలీస్ కమిషనరేట్‌ను మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
కోల్‌సిటీ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పోలీస్ కమిషనరేట్‌ను మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మూలాలను గుర్తించి సమూలంగా చేధించాలని సూచించారు. గురువారం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఈగల్ టీమ్) ఎస్‌పీ గిరిధర్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝాలు పోలీస్ అధికారులకు నార్కోటిక్ డ్రగ్ అండ్ సైపో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) కేసులపై సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన ఎన్‌డీపీఎస్ కేసుల పురోగతి, పెండింగ్ కేసులు, దర్యాప్తు స్థితి, నిందితుల కార్యకలాపాలు, గంజాయి సరఫరా మార్గాలు తదితర అంశాలపై ఎస్‌పీ గిరిధర్ సమీక్షించారు. గంజాయి విక్రయించే వారితోపాటు ఎవరు సరఫరా చేస్తున్నారు, ఏ మార్గాల్లో రవాణా చేస్తున్నారనే అంశాలపై దర్యాప్తుచేపట్టాలని సూచించారు. నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి చట్ట పరమైన ప్రక్రియను అనుసరించి ప్రాపర్టీ సీజ్, ఫ్రీజ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తులో పోలీస్‌స్టేషన్ల అధికారులు, టాస్క్‌ఫోర్స్, ఈగల్ టీమ్ అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) కే శ్రీనివాస్, ఏసీపీలు రమేష్, ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, ఈగల్ ఫోర్స్ కరీంనగర్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్‌పీ ఉపేందర్, నిజామాబాద్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్‌పీ సోమనాథ్, హైదరాబాద్ ఆర్‌ఎన్‌సీసీ డీసీపీ పుష్పకుమార్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
వ్యసనాలకు దూరంగా ఉండాలి
రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయికి అలవాటు పడిన 55మంది యువకులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఈగల్ టీమ్ ఎస్‌పీ గిరిధర్‌లు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను సానుకూల దిశలో వినియోగించుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ఒత్తిడి, చెడు స్నేహాలు, తాత్కాలిక ఆకర్షణల కారణంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారు వాటికి పూర్తిగా దూరమై, అవసరమైన సందర్భంలో పునరావాస సహాయాన్ని పొందుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో వ్యక్తిగత ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు కుటుంబం, విద్య, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. విద్య, సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.