Share News

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 11 , 2026 | 11:55 PM

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 ఎస్‌ఐఆర్‌ జాబితాతో మ్యాపింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఆయన జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

పెద్దపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 ఎస్‌ఐఆర్‌ జాబితాతో మ్యాపింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఆయన జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 15 రోజుల్లో కనీసం 90 శాతం మ్యాపింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. మ్యాపింగ్‌ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు తమ బృందాలను ప్రోత్సహించి మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపునకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. పైవ్రేట్‌ వ్యక్తులు ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ నిర్వహిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను అన్ని వనరుల నుంచి గుర్తించి నియమించుకోవాలని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రారంభమైన తర్వాత రోజూ ఫారాల పంపిణీ, సేకరణపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు తమ ప్రాంతంలోని బీఎల్‌ఓ ఎవరో తెలిసేలా చర్యలు తీసుకోవాలని, నిజమైన ఓటరు తన ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ఆదేశించారు. ప్రముఖుల పేర్లు మిస్‌ అయ్యాయనే వార్తలు రాకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా తప్పనిసరిగా మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్‌ పురోగతిని పెంచేందుకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బీఎల్‌ఓల పని తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్‌ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తామని, రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్డీవోలు గంగయ్య, సురేష్‌, ఎన్నికల విభాగం అధికారి విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:55 PM