Share News

భగ్గుమంటున్న ఎండలు..

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:26 AM

జిల్లాలో పది రోజులుగా ఎండలు భగభగ మండుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు 45.9 డిగ్రీలకు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాతావరణ కేంద్రం అధికారులు జిల్లాను రెడ్‌అలర్ట్‌ కింద ప్రకటించారు.

భగ్గుమంటున్న ఎండలు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో పది రోజులుగా ఎండలు భగభగ మండుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు 45.9 డిగ్రీలకు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాతావరణ కేంద్రం అధికారులు జిల్లాను రెడ్‌అలర్ట్‌ కింద ప్రకటించారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయో ఊహించుకోలేం. గడిచిన పది రోజుల్లో జిల్లాలో ఎండల ధాటికి తట్టుకోలేక ఐదుగురు వడదెబ్బకు గురై మృతి చెందారు. సోమవారం జిల్లాలోని రామగుండం మండలం మల్యాలపల్లి, సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లి, మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. రామగుండం వాతావరణ కేంద్రం ప్రకారం పొద్దంతా సరాసరి గరిష్టంగా 43.2 డిగ్రీలు, కనిష్టంగా 27.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళలో ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రస్తుతం వరి కోతలు, మొక్కజొన్న కోతలు నడుస్తుండడంతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. ఉదయం 6 గంటలకే పొలాల వద్దకు వెళ్లి పనులు చూసు కుని 11 గంటలకు ఇళ్లకు చేరుకుంటున్నారు. తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్లి పనులు చేస్తున్నారు. వరి కోతలు అన్ని హార్వెస్టర్లతో కోస్తున్నప్పటికీ, ఒడ్ల వెంబడి కోయాల్సిన వరి గొలుసులను రైతులే కోస్తు న్నారు. ఎండల నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. ప్రతీ ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు పొద్దంతా తిరుగుతున్నాయి. విద్యుత్‌ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. కూలర్లకు గిరాకీ బాగా పెరిగింది. కూలర్లు లేకుంటే ఇంట్లో ఉన్నా కూడా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.

పది రోజుల్లో వడదెబ్బకు ఐదుగురు మృతి..

జిల్లాలో దంచి కొడుతున్న ఎండల ధాటికి జిల్లాలో పది రోజుల్లో ఐదుగురు వడదెబ్బకు గురై మృతి చెందారు. సోమవారం ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన దశరథ సౌమ్య (19) రెండు రోజులుగా పొలం పనులకు వెళ్లడంతో అస్వస్థతకు గురి కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది. మంథని పట్టణంలో గంధం నగేష్‌ (55), యజ్ఞంపట్ల నారాయణ (68), మండలంలోని చిన్న ఓదాల గ్రామానికి చెందిన దాసరి రమేష్‌ (45), పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన తాళ్ల సుధాకర్‌ (56)లు వడదెబ్బకు గురై ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకున్నది.

జిల్లాలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు..

జిల్లాలో సోమవారం రామగుండం మండలం మల్యాలపల్లి, సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లి, మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ధర్మారం మండల కేంద్రంలో 45.8 డిగ్రీలు, కల్వచర్లలో 45.7 డిగ్రీలు, కనుకులలో 45.6 డిగ్రీలు, ఆకెనపల్లిలో 45.4 డిగ్రీలు, రామగుండలంలో 45.2 డిగ్రీలు, మంథనిలో 45.1 డిగ్రీలు, ఎలిగేడు, కమాన్‌పూర్‌లో 45.0 డిగ్రీలు నమోదయ్యాయి. జూలపల్లిలో 44.9 డిగ్రీలు, ఈసాలతక్కళ్లపల్లిలో 44.8 డిగ్రీలు, పాలితంలో 44.4 డిగ్రీలు, భోజన్నపేట్‌లో 43.6 డిగ్రీలు, ముత్తారంలో 43.6 డిగ్రీలు, రంగపల్లిలో 42.7 డిగ్రీలు, కాల్వశ్రీరాంపూర్‌లో 42.6 డిగ్రీలు, ఓదెలలో 42.3 డిగ్రీలు, కూనారం, ముల్కలపల్లిలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

- డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి

జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ పలు సూచనలు చేశారు.

- ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి.

- బయటకు వెళ్లేటప్పుడు తలపై గుడ్డ/టోపీ ధరించాలి, గొడుగు వాడాలి.

- తరచుగా నీరు, ఓఆర్‌ఎస్‌ మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలి.

- తేలికపాటి, పలుచని, లేత రంగు దుస్తులు ధరించాలి.

- పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి.

- ఎండలో ఎక్కువసేపు పని చేయకుండా మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.

- బయట నిలిపిన వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు.

- మద్యం, అధిక కాఫీ, టీ వంటి పానీయాలు తగ్గించాలి.

వడదెబ్బ లక్షణాలు:

అధిక జ్వరం (శరీర ఉష్ణోగ్రత పెరగడం), తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట, చర్మం ఎర్రబడడం, చెమటలు ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో హీట్‌ స్ట్రోక్‌ చికిత్సకు అవసరమైన సౌకర్యాలు, ఓఆర్‌ఎస్‌, మందులు సిద్ధంగా ఉన్నాయి.

Updated Date - Apr 28 , 2026 | 12:26 AM