కొలువుదీరనున్న పాలకవర్గాలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:39 AM
మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుతీరనున్నాయి. ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరగగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఆ వెంటనే గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు క్యాంపులకు తరలించారు. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానా బాద్, మంథని మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొంది ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది. కౌంటింగ్ పూర్తికాగానే గెలుపొందిన వారిని ఆ పార్టీ నాయకులు క్యాంపులకు తరలించారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుతీరనున్నాయి. ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరగగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఆ వెంటనే గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు క్యాంపులకు తరలించారు. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానా బాద్, మంథని మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొంది ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది. కౌంటింగ్ పూర్తికాగానే గెలుపొందిన వారిని ఆ పార్టీ నాయకులు క్యాంపులకు తరలించారు.
సోమవారం ఉదయం క్యాంపుల నుంచి నేరుగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయాలకు చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ సీక్రెట్ పద్ధతిలో కాకుండా చేయి ఎత్తే పద్ధతిలో జరగనున్నది. రామగుండం మున్సిపల్ కారొరేషన్ మేయర్, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీల చైర్మన్లు ఖరారు అయినప్పటికీ, సుల్తానాబాద్ చైర్మన్ విషయంలో తకరారు ఏర్పడింది. ఈ ఎన్నిక రేపు జరగవలసి ఉండగా, మరుసటి రోజుకు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 38 స్థానాల్లో, బీఆర్‌ఎస్ 13 స్థానాలు, బీజేపీ ఒక స్థానంలో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆరు స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.
పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, 27 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కో స్థానంలో, ఆల్ ఇండియా ఫార్వర్డ బ్లాక్ పార్టీ ఐదు స్థానాల్లో, స్వతంత్రులు రెండు స్థానాల్లో గెలుపొందారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, 12 వార్డులో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డబ్లాక్ పార్టీలు ఒక్కో స్థానంలో గెలుపొందాయి.
మంథని మున్సిపాలిలో 13 వార్డులు ఉండగా, 11 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డబ్లాక్ పార్టీలు ఒక్కో స్థానంలో గెలుపొందాయి. నాలుగింటిలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీలు సాధించడంతో మేయర్ చైర్మన్ల ఎన్నిక లాంఛనప్రాయమే కానున్నది.
ఫ కొలిక్కి వచ్చిన మేయర్, చైర్మన్ల ఎంపిక
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పదవి ఎస్సీ జనరల్ కు కేటాయించగా, ఆ పదవి కోసం మహంకాళి స్వామి, యుగంధర్, మడిపల్లి విజయ, మల్లేష్ పోటీ పడుతున్నారు. అయితే మొదటి నుంచి మేయర్‌గా మహంకాళి స్వామి పేరు వినవస్తున్నది. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రధాన అనుచరుడిగా ఉన్న మహంకాళి స్వామి దాదాపుగా మేయర్‌గా ఖరారు అయినట్లు సమాచారం. సీల్డ్ కవర్లో కూడా ఆయన పేరు ఉన్నట్లు తెలుస్తుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం పాత పెళ్లి ఎల్లయ్య, మారెళ్ళ సుశీల, రాజిరెడ్డి, ముస్తఫా, షాహిద, భద్రం సునీత, సంతోష్ రావు, ఈసంపెళ్లి అంజుల్, గట్ల మహేష్‌లు పోటీ పడుతున్నారు.
పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించగా 21వ వార్డు నుంచి గెలుపొందిన నూగిళ్ల మల్లయ్య పేరు దాదాపుగా ఖరారు అయ్యింది. అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే సమయంలోనే ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మల్లయ్య పేరును ఖరారు చేశారు. దీంతో అక్కడి నుంచి చైర్మన్ కోసం మరెవ్వరూ పోటీ పడడం లేదు. వైస్ చైర్మన్ పదవిని మైనార్టీలకు లేదా ఎస్సీలకు కేటాయించాలని నిర్ణయిం చారు. మైనార్టీల నుంచి తొమ్మిదవ వార్డు నుంచి ఎండి నదీమ్, 14వ వార్డు నుంచి అస్లాం ఫర్వేజ్, 14వ వార్డు నుంచి అస్రం షరీఫ్, 36వ వార్డు నుంచి ముస్కాన్ నాజ్ గెలుపొందారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఏడవ వార్డు నుంచి ఈర్ల స్వరూప, 10వ వార్డు నుంచి అక్కపల్లి సుజాత గెలు పొందారు. మైనార్టీలకు కేటాయిస్తే ముస్కాన్‌నాజ్‌కు, ఎస్సీలకు కేటాయిస్తే మాత్రం ఈర్ల స్వరూపకు వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయించగా ఇక్కడి నుంచి బిరుదు రాధాకృష్ణ, అంతటి పుష్పలత, గాజుల రాజమల్లు చైర్మన్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బిరుదు రాధాకృష్ణకు చైర్మన్ పదవి ప్రతిపాదించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కాంగ్రెస్ పార్టీ గెలుపునకు విశేషంగా కృషి చేశారు. ఫలితాలు వెలువడక ముందే ఆయన దివంగతులయ్యారు. ఎన్నికల్లో ఆయన కుమారుడు బిరుదు రాధాకృష్ణ నాలుగవ వార్డు నుంచి గెలుపొందడంతో ఆయన పట్ల మొగ్గు చూపుతు న్నారు. అయితే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ సతీమణి పుష్పలత 10వ వార్డు నుంచి గెలుపొందడంతో తనకే చైర్మన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన కలువల శంకరమ్మ మద్దతును కూడగట్టినట్లు సమాచారం. చైర్మన్ పదవి కోసం అన్నయ్యగౌడ్ చక్రం తిప్పుతుండడంతో ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయ త్నిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ చైర్మన్ పదవులు ఇవ్వడం వల్ల పార్టీలో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. చివరగా చైర్మన్ పదవి బిరుదు రాధాకృష్ణకే దక్కే అవకాశాలు ఉన్నాయి. వైస్‌చైర్మన్ పదవిని కాపు సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇచ్చే విషయమై ఆలోచన చేస్తున్నారు. అయితే రేపు ప్రమాణ స్వీకారం జరగకుంటే మాత్రం మరుసటి రోజు జరిగే అవకాశాలు ఉన్నాయి.
మంథని మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించగా 11వ వార్డు నుంచి గెలుపొందిన ఓడ్నాల శ్రీనివాస్ పేరు దాదాపుగా ఖరారు అయింది. టికెట్లు ప్రకటించినప్పుడే ఆయన పేరును రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. దీంతో మరెవరు అక్కడ ఆ పదవి కోసం పోటీ పడడం లేదు. వైస్ చైర్మన్ పదవి ఐదో వార్డు నుంచి గెలుపొందిన సహేందర్ రెడ్డినీ వరించే అవకాశాలు ఉన్నాయి.