Share News

అవనిపై విరిసిన ఇంద్రధనుస్సు..

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:41 AM

జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థినులు తరలివచ్చి రంగు రంగుల రంగవల్లిక లతో సంక్రాంతి పండుగను తలపించారు.

అవనిపై విరిసిన  ఇంద్రధనుస్సు..

పెద్దపల్లి టౌన్‌/పెద్దపల్లి రూరల్‌, జనవరి 5 (ఆంఽధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థినులు తరలివచ్చి రంగు రంగుల రంగవల్లిక లతో సంక్రాంతి పండుగను తలపించారు. ఆంధ్రజ్యోతి - ఏబీఎన్‌ సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్‌ బై: సన్‌ఫీస్ట్‌ మ్యాజిక్‌ మమ్స్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌వాసి అగరబత్తీ స్థానిక స్పాన్సర్‌ శ్రీకళ్యాణమస్తు షాపింగ్‌ మాల్‌ సౌజన్యంతో ఆర్యవైశ్య భవన్‌లో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహించగా 91 మంది పాల్లొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టత, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా గంగిరెద్దుల విన్యాసాలు, గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రేగు పండ్లు, చెరుకు గడలు, పాల పొంగు, సకినాలు, అరిసెలు, రంగు రంగులతో వేసిన ముగ్గులు చూపరులను, అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చుక్కల ముగ్గులు అవనిపై విరిసిన హరివిల్లులా అనిపించాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా విద్యార్థుల నుంచి మొదలు పెద్ద వాళ్లు సైతం ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా అదనపు కోర్టు జడ్జి స్వప్నారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, రావికంటి సౌమ్య హరికృష్ణ, మాజీ కౌన్సిలర్‌ బూతగడ్డ సంపత్‌, మాజీ ఎంపీటీసీ బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, మంచాల వరప్రసాద్‌ హాజరయ్యారు. న్యాయ నిర్ణేతలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కె సునీత, కంజర్ల శ్రీలత, మథర్‌ థెరిస్సా ఇంజినీరింగ్‌ కళాశాల లెక్చరర్‌ కంజర్ల శ్రీలత, శ్రీగాయత్రి స్కూల్‌ టీచర్‌ కె సృజన వ్యవహరించారు.

విజేతలు వీరే..

ముత్యాల ముగ్గుల పోటీ ప్రథమ బహుమతి గోదావరిఖని ద్వారకా నగర్‌కు చెందిన సీపెల్లి ఇందు, ద్వితీయ బహమతి గోదావరిఖని తిలక్‌న గర్‌కు చెందిన దుర్గం రేణుక, తృతీయ బహుమతి పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నూనె రాజేశ్వరీ గెలుచుకున్నారు. వీరికి వరుసగా రూ.6 వేలు, రూ. 4 వేలు, రూ. 3 వేలు అందించారు. అంతేగాకుండా మరో 24 మందికి ప్రత్యేక కన్సోలేషప్‌ బహుమతులు, పోటీలో పాల్గొన్న మిగతా మహిళలకు కూడా కన్సోలేషన్‌ బహుమతులను ముఖ్య అతిథులు అందజేశారు.

మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..

- జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

ప్రతీ మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. అందరి జీవితాల్లో ఒడిదొడుకులు ఉంటాయన్నారు. ఇక్కడ వేసిన ముగ్గులు సంక్రాంతి పండుగను తలపిస్తున్నాయని, రంగు రంగులతో వేసిన ముగ్గుల్లాగానే మీ జీవితం కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలని అభిలాషించారు. సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలు గుర్తుంచుకునేలా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించే విధంగా, అందరికీ సామాజిక చైతన్యాన్ని కలిగించే విధంగా మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకుంటున్నాయన్నారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని, పుస్తకాలను చదవడం వల్ల మేథస్సు పెరుగుతుందన్నారు.

ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అని, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు ఉంటారని, దేశంలో స్త్రీలకు ప్రథమ స్థానం ఉంటుందన్నారు. ఆకాశంలో సగం అవకాశాల్లోనూ సగం అందిపుచ్చుకోవాలన్నారు. మొదటి గురువు తల్లి అని, మహిళలకు ఉన్న ప్రాధాన్యం మరెవ్వరికీ ఉండదన్నారు. సంక్రాంతి పండుగ వచ్చే నాటికి ఇళ్లళ్లకు పంట వస్తుందని, ఆ పండుగను ప్రతిబింబించే విధంగా మహిళలు వేసిన ముగ్గులు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఉన్నాయన్నారు. సమ్మక్క సారక్కల స్ఫూర్తి ఇక్కడ కనిపిస్తుందన్నారు.

ఫ జిల్లా అదనపు జడ్జి స్వప్నా రాణి మాట్లాడుతూ సంక్రాంతి నేపథ్యంలో పోటాపోటీగా ముగ్గులు వేశారని, గెలుపోటములు సహజ మని, మొదటి ప్రైజ్‌ వచ్చే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్‌ రిపోర్టర్‌ బుర్ర సంపత్‌ కుమార్‌ గౌడ్‌, పెద్దపల్లి టౌన్‌, రూరల్‌, పాలకుర్తి, ఎలిగేడు, కళ్యాణనగర్‌ రిపోర్టర్లు చింతకింది చంద్రమొగిలి, నాగుల మల్యాల శివ కోటయ్య చారి, సీపెల్లి రాజేశం, కల్వల శంకర్‌, ఏసీఓ అడ్డూరి సంతోష్‌, ఏబీఎన్‌ వీడియో జర్నలిస్టు కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:41 AM