Share News

ముసురు వాన.. మురిసిన రైతన్న...

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:22 PM

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో ఇరవై రోజులుగా వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. సోమవారం రాత్రి నుంచి ముసురు వాన పడుతుండడంతో ఆరుతడి పంటలకు జీవం పోసినట్ల య్యింది.

ముసురు వాన..   మురిసిన రైతన్న...

పెద్దపల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో ఇరవై రోజులుగా వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. సోమవారం రాత్రి నుంచి ముసురు వాన పడుతుండడంతో ఆరుతడి పంటలకు జీవం పోసినట్ల య్యింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా 3,621 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలకుగాను, 7.816 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. తాగు నీరు, ఎన్టీపీసీ అవసరాలకు 447 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తున్నారు. జిల్లాలో మంగళవారం ఉదయం వరకు 40.6 మిల్లీమీటర్ల సగటు వర్ష పాతం నమోదయ్యింది. అత్యధికంగా కమాన్‌పూర్‌ మండలంలో 92.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 50.3 మిల్లీమీటర్లు, ధర్మారం మండలంలో 43.8, ఎలిగేడు మండలంలో 43.0, పెద్దపల్లి మండలంలో 39.9, ముత్తారం మండలంలో 39.2, పాలకుర్తి మండలంలో 38.8, రామగుండం మండలంలో 38.1, జూలపల్లి మండలంలో 35.9, సుల్తానాబాద్‌ మండలంలో 35.1, ఓదెల మండలంలో 34.2, అంతర్గాం మండలంలో 33.2, మంథని మండలంలో 24.2, రామగిరి మండలంలో 20.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపా తం 338.7 మిల్లీమీటర్లకు గాను 256.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణానికి 22 శాతం లోటు వర్షపాతం ఉంది. ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, కమాన్‌పూర్‌, అంతర్గాం, ధర్మారం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాలు సాధారణ వర్షపాతానికి చేరుకోలేదు. ఇప్పటికే వాడి పోతున్న పత్తి, మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

రామగుండం 4 సెంటీమీటర్ల వర్షం

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రోడ్లన్నీ జల మయమయ్యాయి. కళ్యాణ్‌నగర్‌, లక్ష్మీనగర్‌, అడ్డగుంటపల్లి, తిలక్‌నగర్‌, విఠల్‌నగర్‌, గాంధీనగర్‌ ప్రాంతంలో రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. కళ్యాణ్‌నగర్‌లో ఇటీవల ఫుట్‌పాత్‌లు వేయడంతో కొన్ని దుకాణాల్లోకి వరద నీరు చొచ్చుకువచ్చి వస్తువులు తడిసిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం చల్లబడింది.

Updated Date - Jul 21 , 2026 | 11:22 PM