అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:07 AM
ఐసీడీఎస్, ఎన్‌హెచ్‌ఎం పథకాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ నెల 26న నిర్వహించనున్న ’ఛలో హైదరాబాద్‘ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): ఐసీడీఎస్, ఎన్‌హెచ్‌ఎం పథకాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ నెల 26న నిర్వహించనున్న ’ఛలో హైదరాబాద్‘ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయకుండా స్కీమ్ వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని విమర్శించారు. స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయడంతోపాటు బడ్జెట్‌ను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పీఆర్సీలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ.30 వేలు నిర్ణయించాలని కోరారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని, ఆశా వర్కర్లకు విధిస్తున్న ఏఎన్‌సీ టార్గెట్లను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ’ఛలో హైదరాబాద్‘ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బి. వనజారాణి, టి. శారద, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి, ఎస్. రవీందర్, రాజేశ్వరి, శోభ, సులోచన, రాజ నరసమ్మ, సుగుణ పాల్గొన్నారు.