పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవోను రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:03 AM
పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని ట్రినిటి పాఠశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని ట్రినిటి పాఠశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి అజాద్, ప్రీతంలు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఒక ప్రత్యేక వ్యవస్థ అన్నారు. దీనిని శక్తి శాఖలో కలపటం వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు పరమైతే పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన డిప్లొమా విద్య అందకుండా పోతుందని ఆవేదన చెందారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్య్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు తడిగొప్పుల అనుసాయి, అర్నకొండ ఆదిత్య, వెంకటేశ్వర్లు, జశ్వంత్, రోహిత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.