గుట్టలు స్వాహా..
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:56 AM
జిల్లాలో పలు గుట్టలను అక్రమార్కులు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిపేస్తున్నారు. పలు గ్రామాల చుట్టూ సహజ సిద్ధంగా హరితవనాలతో ఆహ్లాదాన్ని పంచే పచ్చని గుట్టలపై జరుగుతున్న ప్రకృతి విధ్వంసం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీటి వెనుక పలువురు నేతలు ఉండడంతో అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు.
జగిత్యాల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గుట్టలను అక్రమార్కులు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిపేస్తున్నారు. పలు గ్రామాల చుట్టూ సహజ సిద్ధంగా హరితవనాలతో ఆహ్లాదాన్ని పంచే పచ్చని గుట్టలపై జరుగుతున్న ప్రకృతి విధ్వంసం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీటి వెనుక పలువురు నేతలు ఉండడంతో అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో నిండుగా పచ్చదనంతో కళకళలాడే గుట్టల ప్రాంతం సహజత్వాన్ని కోల్పోతోంది. మట్టి మాఫియా గుట్ట రాళ్లను, మట్టిని తొలగిస్తోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు, కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా పట్టపగలు సైతం భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి తీయాలంటే ముందస్తుగా అనుమతులు పొంది ప్రభుత్వానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ధన దాహంతో అక్రమార్కులు కొండలు, గుట్టలు మాయం చేస్తూ మైదానాలుగా మారుస్తున్నారు. కొందరు నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలు గ్రామ పంచాయతీల్లో మొరం అక్రమ తరలింపు జరపవద్దని తీర్మానాలు చేసి అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా దందా ఆగడం లేదు.
ఫఅభివృద్ధి పనుల పేరిట పక్కదారి..
ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, పాఠశాలలు, రహదారుల నిర్మాణాలకు మొరం అవసరం కావడంతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా గుట్టలు తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టరు జిల్లా యంత్రాంగం నుంచి మొరం తవ్వకాలు చేసుకోవడానికి అధికారుల సిఫారుసుతో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆధారంగా ఆయా మండలాల తహసీల్దార్లు ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఎక్కడ ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు ఉంటే అక్కడ అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తున్నారు. ఇలా జిల్లాలోని జగిత్యాల రూరల్, బీర్‌పూర్, సారంగాపూర్, బుగ్గారం, మేడిపల్లి, మల్లాపూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, బీమారం, కొడిమ్యాల, మల్యాల, ఎండపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి తదితర మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో, ప్రభుత్వ భూముల్లో, గుట్టల్లో మొరం అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నాయి.
ఫప్రభుత్వ ఆదాయానికి గండి..
గ్రానైట్, కంకర క్వారీ మాదిరిగానే మొరం తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ, భూగర్భ జలాలు, నీటి పారుదల శాఖ, వ్యవసాయ తదితర శాఖల వారు తవ్వకాలకు అనుమతి ఇస్తారు. ఒక్కో క్యూబిక్ మీటర్ మట్టికి రూ.30 రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికివేస్తేనే కేసులు పెట్టే అటవీ శాఖ అధికారులు ఆ చెట్లను కూడా నరికివేసి మొరం గుట్టలను తవ్వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములు అయినా, పట్టా భూములు అయినా నిబంధనలకు లోబడి అనుమతి పొందాలి. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్‌కు డిమాండ్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.4,000 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మొరం రూ.4,000 నుంచి 5,500 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతున్నారు.
అపరాధ రుసుముతో సరి..
అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అపరాధ రుసుము వసూలు చేసి వదిలివేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు భయపడకుండా మళ్లీ అదే దందాకు తెరలేపుతున్నారనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నప్పుడు కేసు నమోదు చేసి సంబంధిత వాహనం, మొరం స్వాధీనం చేసుకొని మైనింగ్ శాఖకు అప్పగించాలి. అధికారులు అపరాధ రుసుమును వసూలు చేసి పంపిస్తున్నారు. అయితే మొరం అక్రమంగా రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపితేనే అక్రమార్కుల్లో మార్పు వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. కేవలం జరిమానాతో వదిలివేయకుండా అవసరమైన సందర్భాల్లో కేసు నమోదు, వాహనం సీజ్, మైనింగ్ శాఖకు అప్పగింత వంటి చర్యలు నిబంధనల ప్రకారం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తీర్మాణం చేసినా తవ్వకాలు ఆగడం లేదు
-వంశీ, నర్సింగాపూర్ సర్పంచ్, జగిత్యాల రూరల్ మండలం
గ్రామ శివారులోని గుట్టల నుంచి మొరం తవ్వకాలు జరపవద్దని ఇటీవల పంచాయతీ తీర్మానం చేశాము. అధికారులకు వినతిపత్రాలు సైతం అందించాం. అయినప్పటికీ యథేచ్ఛగా మొరం తవ్వకాలు ఆగడం లేదు. అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు.