పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:41 PM
పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు అన్నారు. మండలంలోని గంగారం, ఊషన్నపల్లి గ్రామాల్లో బుధవారం రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.32 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని, కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు అన్నారు. మండలంలోని గంగారం, ఊషన్నపల్లి గ్రామాల్లో బుధవారం రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.32 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని, కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. విజయరమణరావు మాట్లాడుతూ ఒకప్పుడు సరైన భవనం లేక 20 మంది విద్యార్థులతో ఉన్న ఊషన్నపల్లి పాఠశాల, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల కృషితో 56 మందికి చేరడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 75కి పెంచాలన్నారు. పాఠశాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు హెచ్‌ఎం సమ్మయ్య, మండల విద్యాధికారి, సర్పంచ్ చొరవతో సొలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. విద్యుత్ వాడకం పోను మిగిలిన డబ్బులు నేరుగా పాఠశాల ఖాతాలోనే జమవుతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నియోజకవర్గంలో విద్యారంగానికి ఇప్పటి వరకు రూ.50 కోట్లపైచిలుకు ఖర్చు చేశామన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంల గత పదేళ్లలో స్కూల్ భవనాలకు కోటి కూడా ఖర్చు చేయలేదని, తమ ప్రభుత్వంలో మాత్రం మూడేళ్లలో ఒక్క కాల్వశ్రీరాంపూర్ మండలంలోనే సుమారు రూ.6కోట్లు, కస్తూర్బా పాఠశాల అదనపు భవనానికి రూ.2.5 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. గంగారం, ఊషన్నపల్లి నుంచి పందిల్ల చౌరస్తా వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కాల్వశ్రీరాంపూర్ నుంచి ఊషన్నపల్లి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. తల్లితండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చర్పించాలని ఆయన కోరారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, తహసిల్దార్ రాముడు, ఎంఈఓ మహేష్, ఎంపీడీఓ సురేందర్, ఉపసర్పంచ్ మేడి అశోక్, ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలకు పిల్లలను పంపే వారి సంక్షేమ పథకాలు రద్దు చేయాలని హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్య ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకువచ్చారు.