యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:53 PM
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించి బొక్కలవాగు సందరీకరణ పనులను ప్రారంభించారు.
మంథని, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించి బొక్కలవాగు సందరీకరణ పనులను ప్రారంభించారు. పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించే 3 నెలల శిక్షణ కోసం మన ఊరు-మన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మంథని క్యాంపు కార్యాలయంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, కలెక్టర్, అధికారులతో కలిసి పరిశ్రమల అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించారు. టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. సివిల్ ఆసుపత్రిలో డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని వైద్య సేవల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ప్రస్తుతం మరో 7 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ అవకాశాన్ని యువత పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. రాబోయే మూడు నెలలు జీవితాన్ని మార్చే కాలంగా భావించి స్పష్టమైన లక్ష్యంతో సిద్ధం కావాలని సూచించారు. కోచింగ్ సెంటర్‌లో అత్యుత్తమ శిక్షణతోపాటు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, వసతి, భోజన సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక వసతులు అన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రాష్ట్రానికి మరిన్ని నాణ్యమైన పెట్టుబడులు రావడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. బొక్కలవాగు వద్ద గార్డెనింగ్, ఓపెన్ జిమ్ అప్‌గ్రేడేషన్, వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం పార్కు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి పనులను సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టాలని హిందుస్థాన్, కోకాకోలా బెవరేజెస్ సంస్థను కోరగా, సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించి రూ. 2 కోట్ల నిధులు అందించారన్నారు. మంథనిలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలు పనులను ప్రభుత్వం ప్రాధాన్యతతో చేపడుతోందన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, ఈఆర్‌సీ మెంబర్ శశిభూషన్‌కాచే, పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కుడుదుల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, నేతలు సెగ్గెం రాజేష్, శివ, ప్రవీణ్, సత్యం, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.